Osmania Biscuits Alert : ఉస్మానియా బిస్కెట్, చాయ్ కాంబినేషన్ ను ఎంతోమంది ఇష్టపడుతారు. రోజూ ఉదయం, సాయంత్రం టైంలో ఉస్మానియా బిస్కెట్లను టీతో తినేవారు చాలామందే ఉంటారు. అయితే ఉస్మానియా బిస్కెట్లను తయారు చేసే కంపెనీలు తయారీ ప్రక్రియలో సరైన పరిశుభ్రతా ప్రమాణాలను పాటించడం లేదని తాజాగా వెల్లడైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ విభాగం అధికారులు మియాపూర్‌లో ఉన్న ఓ బిస్కెట్ తయారీ సంస్థలో తనిఖీలు చేశారు. అక్కడ ఉస్మానియా బిస్కెట్ల తయారీకి వాడుతున్న మెటీరియల్ శుభ్రంగా లేదని గుర్తించారు.
Also read : Great Wall of China : దారికి అడ్డొచ్చిందని.. గ్రేట్ వాల్ ఆఫ్ చైనానే తవ్వేశారు !
ఆ శాంపిల్స్ ను సేకరించిన అధికారులు.. రూ.36 వేల విలువైన ఉస్మానియా బిస్కెట్ల స్టాక్ ను సీజ్ (Osmania Biscuits Alert) చేశారు. వినయ్ వంగాల అనే యువకుడు శనివారం మియాపూర్‌లో ఉస్మానియా బిస్కెట్ ప్యాకెట్‌ను కొన్నాడు. అయితే ఆ ప్యాకెట్ లో నుంచి ఒక బిస్కెట్ తీసి తినబోతుండగా, అందులో ఈగ ఉందని వినయ్ గమనించాడు. దీనికి సంబంధించిన ఫోటో తీసి స్థానిక ఫుడ్ ఇన్‌స్పెక్టర్, ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌కు తన ట్విట్టర్ అకౌంట్ నుంచి కంప్లయింట్ చేశాడు. ఈ ట్వీట్ కు స్పందనగానే అధికారులు ఆ బిస్కెట్ కంపెనీపై రైడ్స్ చేశారు.