AP Assembly : అసెంబ్లీ ఆర్థిక కమిటీల్లో (పీఏసీ) సభ్యుల ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. అసెంబ్లీ కమిటీ హాలులో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యహ్నం 2 గంటల వరకు ఈ పోలింగ్ జరుగుతుంది. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఏ ఎమ్మెల్యే ఎవరికి ఏ సంఖ్య క్రమంలో ఓటు వేయాలో ఎన్డీఏ కూటమి విప్‌లకు బాధ్యత అప్పగించింది. ప్రజాపద్దులు(పీఏసీ ), అంచనాలు(ఎస్టిమేట్స్), ప్రభుత్వ రంగ సంస్థల(పీయూసీ) కమిటీలకు పోలింగ్ జరుగుతోంది. ఎమ్మెల్యేలు ప్రాధాన్య ఓట్ల విధానంలో బ్యాలెట్ పత్రాలపై వారి ఓట్లు నమోదు చేయనున్నారు.
కాగా, అసెంబ్లీ ఆర్థిక కమిటీల్లో ఏదైనా పార్టీ నుంచి ఒక సభ్యుడు ఎన్నికవ్వాలంటే ఆ పార్టీకి శాసనసభలో ఉండాల్సిన కనీస సంఖ్యాబలం 18. అయితే కేవలం 11 మంది సభ్యుల సంఖ్యాబలంతో మూడు కమిటీలకు ముగ్గురు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు నామినేషన్లు దాఖలు చేశారు. ఎమ్మెల్యేల కోటాలో 9కి గాను మొత్తం10 చొప్పున నామినేషన్లు దాఖలవ్వటంతో పోలింగ్ అనివార్యమైంది. ఛైర్మన్లుగా పీఏసీకి పులపర్తి ఆంజనేయులు, అంచనాల కమిటీకి జోగేశ్వర రావు, పీయూసీకి కూన రవికుమార్‌ల ఎన్నిక దాదాపు ఖరారు చేశారు.
మరోవైపు వైఎస్‌ఆర్‌సీపీ ప్రజా పద్దుల కమిటీ సభ్యుల ఎన్నికలను బహిష్కరించింది. ఈరోజు జరగాల్సిన ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. నామినేషన్లు వేసి ఎన్నికల్ని బహిష్కరించిన పెద్దిరెడ్డి. ఈ ఎన్నికలను బాయ్ కాట్ చేయడానికి గల కారణాలను కూడా ఆయన వివరించారు. ప్రభుత్వం తీరు వల్లే తాము పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుల ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు పెద్దిరెడ్డి తెలిపారు.
ఇకపోతే.. ఈ ఎన్నికలకు వైఎస్ జగన్ ఓటేయకుండా అవమానిస్తూ బెంగుళూరుకు వెళ్లినట్లు తెలుస్తుంది. అసలు సంఖ్యాబలం లేదని తెలిసీ..నామినేషన్ వెయ్యించడం ఎందుకు..? ఓటింగ్ సమయానికి ఇలా బెంగుళూరులోని ప్యాలసుకు ప్రయాణం పెట్టుకొని ఇలా అవమానించడం ఎందుకు..? అంతా పిల్ల చేష్టల్లా వుంది. ఏదో మనసులో పెట్టుకొని పెద్దిరెడ్డిని వైఎస్ జగన్ మోసం చేస్తున్నారు..పెద్దిరెడ్డిని బకరాను చేసి అవమానించిన జగన్ అంటూ ఎస్‌ఆర్‌సీపీ సర్కిల్స్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి.
కాగా, గతంలో అసెంబ్లీలో, పార్లమెంట్ లో ఉన్న సంప్రదాయాల ప్రకారం విపక్ష సభ్యులకు పీఏసీ ఛైర్మన్ పగ్గాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కానీ ఈసారి కూటమి ప్రభుత్వం మాత్రం విపక్షానికి సంఖ్యా బలం లేదన్న సాకు చూపి పీఏసీకి ఎన్నికలు నిర్వహిస్తోందన్నారు. కాబట్టి ఈ ఎన్నికల్ని తాము బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలో ఎక్కడైనా ప్రభుత్వ తప్పిదాల్ని ప్రశ్నించే పీఏసీ పదవిని విపక్షాలకు ఇస్తారని, కేవలం ఆప్ఘనిస్తాన్ లో తాలిబాన్లు తప్ప ఎవరూ ఇలా చేయరని పెద్దిరెడ్డి కూటమి ప్రభుత్వం పై మండిపడ్డారు.