Site icon HashtagU Telugu

Amaravati : రాజధాని నిర్మాణానికి త్వరలోనే మరో 16,000 కోట్లు

Amaravati

Amaravati

Amaravati : అమరావతి రాజధాని నిర్మాణం మరో దశలోకి ప్రవేశిస్తోంది. ఈ ప్రాజెక్టుకు నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ₹16,000 కోట్ల రుణం పొందేందుకు ఏర్పాట్లు చేస్తోంది. హడ్కో , జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంకులు సంయుక్తంగా ఈ రుణం ఇవ్వనున్నాయి. వీటిలో హడ్కో ₹11,000 కోట్లు, కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంకు ₹5,000 కోట్లు అందించేందుకు సిద్ధమయ్యాయి. రుణం మంజూరు ప్రక్రియ 15-20 రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ రుణాలపై సంప్రదింపులు జరిపేందుకు సీఆర్‌డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్‌కు పూర్తి అధికారాలు అప్పగించామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సీఆర్‌డీఏ అథారిటీ 40వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రపంచ బ్యాంకు, ఏడీబీ సహకారం:
ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకులు కలసి రాజధానికి ఇప్పటికే ₹15,000 కోట్ల రుణం మంజూరు చేయడానికి సిద్ధమయ్యాయి. ఈ ఒప్పందానికి సంబంధించి వచ్చే నెలలో ప్రపంచ బ్యాంకు బోర్డు సమావేశంలో తుది ఆమోదం పొందనుంది. అందులో 25 శాతం నిధులు ఈ నెలాఖరులోగా సీఆర్‌డీఏకు అందుతాయని అధికారులు తెలిపారు.

రాజధాని ఆర్కిటెక్చర్‌కు నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ:
రాజధానిలో నిర్మించనున్న హైకోర్టు, శాసనసభ, సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయ టవర్ల డిజైన్‌లను లండన్‌కు చెందిన ప్రఖ్యాత నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్ సంస్థకు తిరిగి అప్పగించారు. గతంలోనూ ఈ సంస్థే ఈ భవనాల ప్రణాళికను రూపొందించింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ పనులను నిలిపివేయడంతో ఈ సంస్థ వెనక్కి వెళ్లిపోయింది. తాజాగా టెండర్ ప్రక్రియలో ఎల్‌1గా నిలిచిన ఈ సంస్థ మళ్లీ ఈ ప్రాజెక్టుకు ఎంపికైంది.

టవర్ల నిర్మాణ వ్యయం:
హైకోర్టు, శాసనసభ భవనాల కోసం ₹138 కోట్లు, సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయాలకు సంబంధించిన ఐదు టవర్లకు మరో ₹138 కోట్లు ఖర్చు చేస్తారని సీఆర్‌డీఏ అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలను కూడా ఈ టవర్లలోనే ఏర్పాటు చేయనున్నారు. హడ్కో, కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంకుల నుంచి నిధులు సమకూరితే రాజధాని నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయవచ్చని సీఆర్‌డీఏ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

 
Salicylic Acid : ఇంట్లో సాలిసిలిక్ యాసిడ్ స్కిన్ క్లెన్సర్‌ను ఎలా తయారు చేయాలి..?