Site icon HashtagU Telugu

Amitabh Bachchan : వాక్‌ స్వేచ్ఛ’పై అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యలు…ట్విటర్‌ వార్‌

Pathaan Amitabh Bachchan

Amitab

దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛపై ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. ‘పఠాన్ (Pathaan)‌’ సినిమాపై వివాదం జరుగుతున్న వేళ అమితాబ్‌ ‘వాక్‌ స్వాతంత్ర్యం’ పై మాట్లాడటం.. తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC), భాజపా (BJP) నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఇంతకీ బిగ్‌బీ ఏమన్నారు..? ఆ వ్యాఖ్యలు ఎందుకు వివాదాస్పదమయ్యాయి? అంటే..

పశ్చిమ బెంగాల్‌లో కోల్‌కతా అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌లో బాలీవుడ్‌ ప్రముఖులు అమితాబ్‌ బచ్చన్‌, షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా హాజరయ్యారు. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే బిగ్‌బీ ఈ వేడుకలో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికీ పౌర హక్కులు, భావ ప్రకటనా స్వేచ్ఛ (Freedom of Expression)పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి’’ అన్నారు. షారుక్‌ ఖాన్‌ నటించిన ‘పఠాన్‌’ చిత్రంపై వివాదం జరుగుతున్న వేళ.. అమితాబ్‌ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ దుమారానికి దారితీసింది.

బిగ్‌బీ వ్యాఖ్యలపై భాజపా ఐటీ విభాగం హెడ్‌ అమిత్‌ మాల్వియా ట్విటర్‌లో స్పందిస్తూ.. ‘‘కోల్‌కతాలో మమతా బెనర్జీ వేదికపై ఉండగా.. అమితాబ్‌ బచ్చన్‌ మాటలు మరింత ప్రవచనాత్మకంగా ఉండవు. నిరంకుశులకు(మమతా బెనర్జీని ఉద్దేశిస్తూ) అద్దం పట్టినట్లుగానే ఉంటాయి’’ అని విమర్శించారు. ఆ నిరంకుశురాలి(మమత) నాయకత్వంలో ఈ దేశం ఎన్నికల అనంతరం ఘోరమైన హింసను చవిచూసిందని మండిపడ్డారు. బెంగాల్‌ ప్రతిష్ఠను ఆమె దిగజారుస్తున్నారని ఆరోపించారు.

కాగా.. అమిత్ మాల్వియా ట్వీట్‌కు తృణమూల్‌ ఎంపీ నుశ్రత్‌ జహాన్‌ (Nussrat Jahan) గట్టిగా బదులిచ్చారు. ‘‘సినిమాలపై నిషేధం విధించడం, జర్నలిస్టులను నిర్బంధించడం, నిజం మాట్లాడినందుకు సామాన్యులను శిక్షించడం.. ఇవే నిరంకుశ పాలన సంకేతాలు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై పరిమితులు విధించడం కూడా ఆ పాలనకు నిదర్శనమే. ఇదంతా భాజపా హయాంలోనే జరుగుతోంది. కానీ, అమిత్ మాల్వియా మాత్రం ఇతరులను నిందించడంలో బిజీగా ఉన్నారు’’ అంటూ నుశ్రత్‌ కౌంటర్‌ ఇచ్చారు.

షారుక్‌, దీపికా పదుకొణె (Deepika Padukone) నటించిన ‘పఠాన్‌’ సినిమాకు బాయ్‌కాట్ సెగ తగిలిన విషయం తెలిసిందే. ఈ చిత్రం నుంచి ఇటీవల వచ్చిన ‘బేషరమ్‌ రంగ్’ (besharam rang) పాటలో దీపిక ధరించిన దుస్తులు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ భాజపా నేతలతో పాటు పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ సినిమాను నిషేధించాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ఈ వివాదంపై కోల్‌కతా ఫిలిం ఫెస్టివల్‌లో షారుక్‌ పరోక్షంగా స్పందించారు. సామాజిక మాధ్యమాలు తరచూ సంకుచిత పోకడలతో విభజన కారక, విధ్వంసక పాత్ర పోషిస్తున్నాయని విమర్శించారు.

Also Read:  Accident : డివైడర్‌ ను ఢీకొన్న కారు. మంటలు చెలరేగి తల్లీ కుమారుడు మృతి