Site icon HashtagU Telugu

Amedkar Statue Politics: అంబేడ్కర్ విగ్రహం చుట్టూ నడిచిన రాజకీయం…

ambedkar statue politics

Ambedkar Statue (1)

Amedkar Statue Politics: ట్యాంక్ బండ్ వద్ద 125 అడుగుల డా:బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహం ఆవిష్కృతమైంది. ఈ అంశాన్ని అధికార పార్టీ, ప్రతిపక్షాలు కేవలం తమ స్వార్ధ రాజకీయాల కోసమే వాడుకున్నాయి అనిపిస్తుంది. ఎన్నికల నేపథ్యంలోనే సీఎం కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తున్నాయి విపక్షాలు. అయితే కేవలం అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే తెలంగాణ వచ్చింది అంటుంది అధికార పార్టీ. ఈ విమర్శలు ప్రతి విమర్శలకు అంబేడ్కర్ విగ్రహం అడ్రస్ కావడం బాధాకరం. ఇక్కడ ప్రజలు ఎవరి మాటలు నమ్మాలో తెలియక అయోమయంలో పడుతున్నారు.

అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని నగరం నడిబొడ్డున భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. చాలా అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. కానీ విగ్రహ ఆవిష్కరణపై ఒక్కసారిగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఎవరెవరు ఏమన్నారో చూద్దాం. ముందుగా అధికార పార్టీ నాయకుల వ్యవహారం గమనిస్తే…అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే తెలంగాణ వచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. నిజానికి ఈ మాట కేటీఆర్ మొదటి సారి అన్నారు. ఇదివరకెప్పుడూ అంబేడ్కర్ వల్లనే తెలంగాణ వచ్చినట్టు చెప్పిన దాఖలాలు లేవు.

ఇక ముఖ్యమంత్రి కెసిఆర్ ఏకంగా అంబేడ్కర్ జయంతి నాడు ప్రతి ఏడాది అవార్డులు ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. ఇంతకీ అవార్డుల ఇవ్వడం వల్ల ప్రజలకు జరిగే మేలు ఏంటి? 50 కోట్లు డిపాజిట్ చేసి వచ్చే మూడు కోట్ల వడ్డీ సొమ్ముని ఈ అవార్డులకు ఖర్చు చేస్తామని ప్రకటించారు. ఇంతకీ ఆ అవార్డులు ఎవరడిగారు? ప్రజల శ్రేయస్సు కోరితే అవార్డులా ఇవ్వాల్సింది?. ఇక ఆయన స్పీచ్ లో అంబేడ్కర్ ఉత్సవాలను జరుపుకోవడమేనా… ఆయన ఆశయాలను సాధించొద్దా అంటూ చెప్పుకొచ్చారు. అసలు అంబేడ్కర్ ఆశయాలు ఏంటి? ఆయన ఆశయాలు సాధనలో కీలకం ప్రభుత్వాలే కదా. మరి ఆయన ఆశయాలను సాధించే క్రమంలో అధికార పార్టీ చేసేది అవార్డులు ఇవ్వడం ఒక్కటేనా? దేశంలోనే భారీ విగ్రహం పెట్టామని చెప్పుకుంటారు మునుముందు. సరే…. పెద్ద పెద్ద విగ్రహాలు పెడితే ఆయన ఆశయాలు నెరవేర్చినట్టా?. ఇలా అధికార పార్టీ అంబేడ్కర్ జయంతి రోజున కానిచ్చేసింది.

తెలంగాణా ( Telangana )లో ప్రతి పక్షాలు చూసుకుంటే కాంగ్రెస్, బీజేపీ ప్రధాన పార్టీలుగా చెప్పుకోవాలి. అయితే ఈ రోజు వారేమైనా ప్రజలను దృష్టిలో ఉంచుకుని అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణపై మాట్లాడారా అంటే అదీ లేదు. కెసిఆర్ అంబేడ్కర్ ఆశయాలకు వ్యతిరేకి, దళితుడిని సీఎం చేయలేదు, కెసిఆర్ దళితులకు వ్యతిరేకం అని మాట్లాడారు. దళిత సీఎం అనేది గతం. 2014 లో దళితుడిని సీఎం చేస్తానన్న కెసిఆర్ చేయలేదు. ఇంకెన్నాళ్లు దళితుడు సీఎం అంటూ రాజకీయ పబ్బం గడుపుతారు. నిజంగా దళితులపై అంత ప్రేమ ఉంటె వారి శ్రేయస్సుకు మీరేం చేస్తారో చెప్పాలి కదా. అది కాకుండా విమర్శలు చేయడం ద్వారా ఎవరికీ నష్టం? ఎవరికీ లాభం? ఇక్కడ ప్రజలు ఎక్కడ కనిపిస్తున్నారు. రోజంతా చెరొక మాట అనుకోవడమే కనిపించింది.

అసలు అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ రోజు ఎందుకిత రాజకీయం చేస్తున్నారు. ఈ రోజు మాట్లాడితే ప్రజలు వింటారు, చూస్తారు కాబట్టి ఏదైనా మాట్లాడొచ్చు అన్న కాన్సెప్ట్ మాత్రమే బట్టబయలు అయింది. బీఆర్ఎస్, కాంగ్రెస్మ్ బీజేపీ ఈ మూడు పార్టీలు ఈ రోజు మాట్లాడిన మాటల వల్ల ఏమైనా లాభం కనిపించిందా? ఒకవేళ లాభం చేకూరితే అది రాజకీయ నేతలకే తప్ప మరింకేం లేదు. ఇది స్పష్టం. సమయం చూసి మీద పడ్డట్టు ఉంది ఈ రోజు అధికార పక్షం, విపక్షం వ్యవహారం గమనిస్తే.

Read More: Dr. Br Ambedkar : ఈరోజు డా.బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల కంచు విగ్రహం ఆవిష్కరణ..