Site icon HashtagU Telugu

Allu Arjun : కాంగ్రెస్‌లోకి అల్లు అర్జున్ మామ..

Kancharla Chandrashekar Reddy

Kancharla Chandrashekar Reddy

తెలంగాణలో పార్లమెంట్‌ ఎన్నికల వేడి మొదలైంది. వచ్చే నెలలో పార్లమెంట్‌ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఇచ్చే అవకాశం ఉండటంతో ఈ ఎన్నికల్లో పోటీ చేసేందకు ఆసక్తిగా ఉన్న నేతలు పావులు కదుపుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అధికార కాంగ్రెస్‌ పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా బీఆర్‌ఎస్‌కు చెందిన నేతలు కాంగ్రెస్‌ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. అంతేకాకుండా.. కొందరు బాహటంగా కాంగ్రెస్‌(Congress) లోకి చేరుతున్నట్లు ప్రకటించారు. అయితే.. తాజాగా ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి (Kancharla Chandra Shekar Reddy) ఇవాళ కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఇప్పటివరకు బీఆర్‌ఎస్‌ (BRS)లో ఉన్న ఆయన ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో భేటీ అయ్యారు. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. ఎంపీగా పోటీ చేస్తే అల్లుడు అర్జున్ ప్రచారం చేస్తారా? అని ప్రశ్నించగా.. తన గెలుపునకు ఆయన తప్పకుండా కృషి చేస్తారని చంద్రశేఖర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటే.. పార్లమెంట్ ఎన్నిక‌ల స‌మ‌యంలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ప్ర‌య‌త్నాల‌ను ముమ్మరం చేసింది. బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై ఆ పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన కారు పార్టీకి కోలుకోలేని దెబ్బ కొట్టాలనే లక్ష్యంతో వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగానే మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి (Patnam Mahender Reddy) కుటుంబాన్ని ప్రభావితం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. మహేందర్ రెడ్డితో పాటు ఆయన సతీమణి, వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డి (Sunitha Reddy) ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. చేవెళ్ల ఎంపీ టికెట్‌ హామీ ఇవ్వడంతో సునీతారెడ్డి కుటుంబం బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైంది. తెలంగాణ పునర్నిర్మాణానికి సహకరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సునీతారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ పట్నం సునీతారెడ్డి, ఆమె కుమారుడు రినీషారెడ్డి తమ అనుచరులతో కలిసి అధికారికంగా కాంగ్రెస్‌లో చేరనున్నారు. శుక్రవారం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది.

ఉమ్మడి జిల్లాలోని బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు సునీతారెడ్డితో కలిసి కాంగ్రెస్‌ పాదయాత్రలో పాల్గొననున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని మహేందర్ రెడ్డి నివాసం నుంచి గాంధీభవన్ వరకు భారీ ర్యాలీకి సన్నాహాలు చేశారు. కాగా, జెడ్పీ చైర్‌పర్సన్‌గా సునీతారెడ్డి వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. ఆమె గతంలో రెండుసార్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా పనిచేసి ప్రస్తుతం వికారాబాద్ జెడ్పీ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. 2018 సార్వత్రిక ఎన్నికల్లో మహేందర్ రెడ్డి సోదరుడు నరేందర్ రెడ్డి (Patnam Narender Reddy) కొడంగల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విజయం సాధించారు. 2023 సార్వత్రిక ఎన్నికలకు ముందు పట్నం కుటుంబం కాంగ్రెస్‌లో చేరాలని భావించినా, కేసీఆర్ వారిని ఒప్పించలేకపోయారు. అందుకే సునీతారెడ్డికి చేవెళ్ల ఎంపీ సీటు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీనికి తోడు జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన సతీమణి, చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్లలో ఒకరు ఈరోజు కాంగ్రెస్‌లో చేరనున్నారు.

Read Also : ISRO : GSLV F-14 రాకెట్‌ ప్రయోగానికి సర్వం సిద్ధం..