Site icon HashtagU Telugu

Gandhi Hospital: బాలికకు శస్త్ర చికిత్సలో 25 రోజుల జాప్యం!

gandhi hospital

gandhi hospital

హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో అత్యవసర వైద్య సేవల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డు ప్రమాదం లో తల్లిదండ్రులను కోల్పోయి..తృటిలో ప్రాణాలతో బయటపడిన 14 ఏళ్ల బాలిక అక్షయకు న్యూరో సర్జరీ చేయడంలో వైద్యులు తీవ్ర జాప్యం చేశారు. వెన్నెముక కు తీవ్ర గాయాలతో మార్చి 31న గాంధీ లో చేరిన బాలికకు ఏప్రిల్ 26న సర్జరీ చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇంత ఆలస్యంగా శస్త్రచికిత్స జరిగిందని బాలిక బంధువులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ఏప్రిల్ 15న ఆమెకు సర్జరీ చేస్తామంటూ న్యూరో సర్జరీ వార్డుకు తీసుకెళ్లారు.

అయితే ఆమెకు జ్వరంగా ఉందని గుర్తించామంటూ వైద్యులు సర్జరీని వాయిదా వేశారు. రెండు, మూడు రోజులకు మరోసారి సర్జరీకి డేట్ ను ఫిక్స్ చేసినప్పటికీ.. తగిన సైజున్న సర్జికల్ స్క్రూ లు లేవంటూ ఇంకో దఫా కూడా వాయిదా వేశారు. ఎట్టకేలకు అక్షయ ఆస్పత్రిలో చేరిన 25 రోజుల తర్వాత ఈనెల 25న రాత్రి సర్జికల్ స్క్రూలు సిద్ధమయ్యాయి. దీంతో 26న ఉదయం శస్త్ర చికిత్స నిర్వహించారు. ప్రస్తుతం అక్షయ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, గాంధీ ఆస్పత్రిలో గత రెండున్నర ఏళ్లుగా MRI మెషీన్ లేదని వైద్యులు తెలిపారు.అక్షయ కు సంబంధించిన MRI స్కానింగ్ ను పూర్తి చేసి, రిపోర్టును ఇవ్వడానికి ఇతర ఆస్పత్రులు దాదాపు ఐదు రోజుల సమయం తీసుకున్నాయని, సర్జరీ చేయడంలో జాప్యానికి అదే ప్రధాన కారణమని చెప్పారు.