Deaf and Mute Girl : ముంబైలో అత్యంత అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మూగ, చెవిటి యువతిపై అత్యాచారం జరిగింది. ఫలితంగా ఆ యువతి గర్భందాల్చగా.. నిందితుడిని గుర్తించేందుకు జరిపిన డీఎన్ఏ పరీక్షలో షాకింగ్ విషయం బయటపడింది. ఆ యువతి కన్నతండ్రే ఈ దారుణానికి పాల్పడ్డాడని తేలింది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..
ముంబైలోని కఫీ పరేడ్ ఏరియాలో ఉండే మూగ, చెవిటి యువతి గతేడాది సెప్టెంబర్ లో అనారోగ్యానికి గురైంది. కడుపు నొప్పిగా ఉందంటూ యువతి సైగలతో నానమ్మకు చెప్పింది. దీంతో యువతిని ఆవిడ ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్య పరీక్షల్లో యువతి ఐదు నెలల గర్భవతిగా తేలడంతో డాక్టర్లు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే, కేసు పెట్టేందుకు యువతి కానీ, ఆమె తండ్రి కానీ ముందుకు రాలేదు.
యువతికి కౌన్సెలింగ్ ఇచ్చి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. ఓ 17 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. మరో 16 మందిని అనుమానితులుగా తేల్చారు. వీరిలో యువతిపై అత్యాచారం జరిపింది ఎవరనేది నిర్ధారించేందుకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాల్సిందిగా వైద్యులను ఆశ్రయించారు.
యువతి తండ్రి సహా మొత్తం 17 మంది డీఎన్ఏను యువతి గర్భంలో పెరుగుతున్న పసికందు డీఎన్ఏతో పోల్చిచూడగా.. యువతి కన్నతండ్రి డీఎన్ఏ ఒక్కటే మ్యాచ్ అయింది. దీంతో యువతిపై అత్యాచారం జరిపి ఆమెను గర్భవతిగా చేసిన నిందితుడు కన్నతండ్రేనని స్పష్టమైంది. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
