Twitter Data For Sale : 40 కోట్ల మంది ట్విట్టర్‌ యూజర్ల డేటా చోరీ

ఎలాన్ మస్క్ (Elon Musk) నేతృత్వంలో పని చేస్తున్న కంపెనీలో,

అదేంటో, 2022 సంవత్సరం ట్విట్టర్‌కు (Twitter) అస్సలు కలిసి రాలేదు. ట్విట్టర్‌ చరిత్రలో ఎన్నడూ జరగని  సినిమా తరహా సంఘటలన్నీ ఈ సంవత్సరమే జరిగాయి. ప్రస్తుతం ఎలాన్ మస్క్ (Elon Musk) నేతృత్వంలో పని చేస్తున్న కంపెనీలో, ఇప్పటికే ప్రతిదీ అస్తవ్యస్తంగా ఉంది. ఇప్పుడు మరో కొత్త తలనొప్పి మొదలైంది.

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ (Google CEO Sundar Pichai), బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ‍‌(Actor Salman Khan), మరికొందరు గ్లోబల్‌ బిగ్‌ షాట్స్‌ సహా దాదాపు 40 కోట్ల మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారం లీక్‌ అయింది. ఆ డేటాను ఒక హ్యాకర్ దొంగిలించాడని తెలుస్తోంది. ఆ వ్యక్తి ఆ 40 కోట్ల మంది వ్యక్తిగత డేటాను డార్క్ వెబ్‌లో (dark web) అమ్మకానికి ఉంచినట్లు గ్లోబల్‌ మీడియా కథనాల ద్వారా అర్ధం అవుతోంది. కోట్ల మంది వ్యక్తిగత విషయాలను సదరు హ్యాకర్‌ అమ్మకానికి పెట్టిన తర్వాతే, తమ కంపెనీ నుంచి సమాచారం బయటకు వెళ్లిపోయిందని ట్విట్టర్‌ కూడా తెలిసింది.

ఇజ్రాయెల్‌కు చెందిన సైబర్ ఇంటెలిజెన్స్ కంపెనీ హడ్సన్ రాక్ (Hudson Rock) నుంచి వచ్చిన ఒక రిపోర్ట్‌ ప్రకారం, డార్క్ వెబ్‌లో అమ్మకానికి ఉంచిన ట్విట్టర్ (Twitter) వినియోగదారుల డేటాలో ఈ-మెయిల్ అడ్రస్‌, ఖాతాదారు పేరు, యూజర్‌ నేమ్‌, ఫాలోవర్స్‌, కొంతమంది ఫోన్ నంబర్లు వంటి వ్యక్తిగత వివరాలు ఉన్నాయి.

అతి పెద్ద హ్యాక్‌:

కోట్లాది మంది ట్విటర్ వినియోగదారుల డేటాను హ్యాకర్లు యాక్సెస్ చేయడం ఇదే మొదటిసారి కానప్పటికీ, గత సందర్భాలతో పోలిస్తే మాత్రం ఇదే అతి పెద్దది. రెండు నెలల క్రితం, 5.4 మిలియన్ల (54 లక్షలు) ట్విట్టర్ యూజర్ డేటా లీక్ అయింది. గత డేటా లీక్‌ మీద, ఐరిష్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ (DPC) దర్యాప్తును ప్రారంభించింది.

తాజా లీక్ విషయానికి వస్తే… ఒక అనామక హ్యాకర్, ఒక హ్యాకర్ ఫోరంలో డేటా శాంపిళ్లను పోస్ట్ చేశాడు. డార్క్ వెబ్‌లో అమ్మకానికి పెట్టిన వివరాలు ఎలాంటివో ఈ డేటా శాంపిళ్లు అద్దం పట్టాయి. ఈ లీక్‌లో కొన్ని హై ప్రొఫైల్ ఖాతాలు కూడా ఉన్నాయి.

హ్యాక్‌కు గురైన హై ప్రొఫైల్ ఖాతాల్లో ఇవి కొన్ని:

✽ భారత ప్రభుత్వ సమాచార & ప్రసారాల మంత్రిత్వ శాఖ ఖాతా
❉ సుందర్ పిచాయ్
✾ సల్మాన్ ఖాన్
✼ అలెగ్జాండ్రియా ఒకాసియో – కోర్టెజ్
❃ స్పేస్‌ఎక్స్
❋ CBS మీడియా
❉ డొనాల్డ్ ట్రంప్ జూనియర్
❀ డోజా క్యాట్
✿ చార్లీ పుత్
☘ నాసాకు చెందిన JWST అకౌంట్‌
✥ NBA
✤ షాన్ మెండిస్
❁ WHO సోషల్ మీడియా ఖాతా

API లోపం కారణంగా కోట్లాది మంది ట్విటర్ వినియోగదారుల వ్యక్తిగత వివరాలను హ్యాకర్ యాక్సెస్ చేయగలిగారని హడ్సన్ రాక్ తెలిపింది. ఈ బగ్ వల్ల, హ్యాకర్ కోట్లాది ట్విట్టర్ (Twitter) ఖాతాల ఈ-మెయిల్ ఐడీలు, ఫోన్ నంబర్ల వంటి వ్యక్తిగత వివరాలను హ్యాకర్‌ యాక్సెస్ చేసి ఉండవచ్చని వెల్లడించింది. డార్క్ వెబ్‌లో హ్యాకర్ చేసిన పోస్ట్‌ల స్క్రీన్‌షాట్‌లను హడ్సన్ రాక్ షేర్‌ చేసింది.

మస్క్‌కు అమ్మకం ఆఫర్‌:

ట్విట్టర్‌ నుంచి తాను కొల్లగొట్టిన డేటాను అవసరమైతే ఎలాన్‌ మస్క్‌కు కూడా అమ్ముతానని హ్యాకర్‌ ప్రకటించడం విశేషం. “ట్విటర్‌ లేదా మస్క్‌ ఎవరైనా పర్లేదు. ఈ సమాచారం మీకే కావాలంటే మీకే అమ్ముతాను. 54 లక్షల మంది డేటా లీక్‌ సంఘటనలో భారీ పెనాల్టీ కట్టాల్సిన రిస్క్‌లో ట్విట్టర్‌ ఉంది. ఇక 40 కోట్ల మంది అంటే మీరు ఎన్ని కోట్లు కట్టాల్సిన పరిస్థితి వస్తుందో ఊహించండి. మీకు పెనాల్టీ ముప్పును తప్పించడానికి, ఆ డేటాను మీకే అమ్ముతాను. కావాలంటే మధ్యవర్తులనైనా పెట్టుకోండి. వాళ్లకే విక్రయిస్తాను. ఒకసారి డేటాను అమ్మాక, నా దగ్గరున్న మొత్తం సమాచారాన్ని డిలీట్‌ చేసేస్తా. ఇక ఎవరికీ విక్రయించను”’ అని హ్యాకర్‌ ప్రకటించినట్లు హడ్సన్‌ రాక్‌ వెల్లడించింది.

Also Read:  Diet Plan : 2023లో ఈ 6 తప్పిదాలు మీ డైట్ ప్లాన్ లో జరగకుండా చూసుకోండి