Shooting In Philadelphia: ఫిలడెల్ఫియాలో కాల్పుల (Shooting In Philadelphia) ఘటన జరిగింది. జూలై 3 రాత్రి జరిగిన ఈ కాల్పుల్లో నలుగురు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు జూలై 2 ఉదయం బాల్టిమోర్‌లో ఒక పార్టీ తర్వాత సామూహిక కాల్పులు తరువాత ఇద్దరు వ్యక్తులు మరణించిన విషయం తెలిసిందే.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమెరికా స్వాతంత్య్ర దినోత్సవానికి ఒకరోజు ముందు ఫిలడెల్ఫియాలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. సోమవారం అర్థరాత్రి జరిగిన ఈ కాల్పుల్లో నలుగురు మరణించారు. అదే సమయంలో మరికొందరు గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పట్టుకున్నామని, బాలిస్టిక్ చొక్కా ధరించి ఉన్నాడని పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు.
ఘటనా స్థలం నుంచి రైఫిల్, తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌క్వైరర్, ABC న్యూస్ అనుబంధ సంస్థలు ఇద్దరు టీనేజర్లు కూడా కాల్పులకు గురయ్యారని నివేదించాయి. ఆరుగురు బాధితులను పెన్ ప్రెస్‌బిటేరియన్ మెడికల్ సెంటర్‌కు తరలించామని, ఇద్దరు ఫిలడెల్ఫియాలోని చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని పోలీసు అధికార ప్రతినిధి జాస్మిన్ రీల్లీ తెలిపారు. కాల్పులకు కారణాలు సైతం తెలియ రాలేదు. వరుసగా జరుగుతున్న కాల్పులపై అగ్రరాజ్యంలో ఆందోళన వ్యక్తమవుతుంది.
ఒకరోజు క్రితం బాల్టిమోర్‌లో కాల్పులు
జులై 2 ఉదయం బాల్టిమోర్‌లోని పార్టీ తర్వాత సామూహిక కాల్పులు జరిగాయి. ఇద్దరు వ్యక్తులు మరణించారు. 28 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 14 మంది చిన్నారులు కూడా ఉన్నారు. పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం మృతుల్లో 18 ఏళ్ల యువతి, 20 ఏళ్ల యువకుడు ఉన్నారు.