Site icon HashtagU Telugu

TSRTC: సంక్రాంతికి 2.5 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం

Tsrtc

Tsrtc

TSRTC: తెలంగాణా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్కీమ్ మహాలక్ష్మి. ఇందులో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పించారు. జీరో టికెట్ తీసుకొని మహిళలు బస్సుల్లో రాష్ట్రమంతటా ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవాలంటే ఒరిజినల్‌ గుర్తింపు కార్డు తప్పనిసరి చేశారు. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాల్సి ఉంటుంది. ఈ పథకాన్ని మహిళలు, బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు ఉపయోగించుకోవచ్చు.

సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ద తీసుకుని బస్సులను నడిపించింది. నగరం నుంచి వేలాది మంది ప్రజలు పల్లెకు ప్రయాణాలు చేస్తారు కాబట్టి అందుకు తగ్గట్టే బస్సుల సంఖ్యను పెంచింది. కాగా తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (TSRTC) జనవరి 10 నుంచి 18 వరకు సంక్రాంతి పండుగ సీజన్‌లో సుమారు 2.5 కోట్ల మంది మహిళలను ఉచితంగా రవాణా చేసింది. సంక్రాంతి సందర్భంగా 2.5 కోట్ల మంది మహిళలు ఆర్టీసీని ఉచితంగా వినియోగించుకున్నారని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా సగటున రోజుకు 27 లక్షల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తుండగా, పండుగల సీజన్‌లో 29 లక్షల మంది మహిళలు తమ స్వస్థలాలకు వెళ్లి తిరిగి రావడానికి ప్రజా రవాణాను ఉపయోగించుకున్నారు. పండుగ రోజుల్లో ఆక్యుపెన్సీ రేషియో 90%కి చేరుకుందని సంస్థ పేర్కొంది.

డిసెంబర్ 2023లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రారంభించిన మహిళలకు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం పథకమే TSRTC బస్సుల పెరుగుదలకు కారణమని చెప్పవచ్చు.మొదట్లో సంక్రాంతికి 4,484 బస్సులను నడిపింది, వివిధ ప్రాంతాల అవసరాలను బట్టి 6,260 బస్సులకు పెంచారు.

Also Read: Almonds Benefits: మ‌హిళ‌లు బాదంపప్పు ఎందుకు తినాలంటే..?