Human Rights Day 2024 : ఇవాళ (డిసెంబరు 10) ‘అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం’. ‘‘మన హక్కులు, మన భవిష్యత్తు.. ఇప్పటికిప్పుడు’’ అనేది ఈ ఏడాది మానవ హక్కుల దినోత్సవం థీమ్. సార్వజనీన మానవ హక్కుల ప్రకటన(Human Rights Day 2024)ను 1948 డిసెంబరు 10న ఐక్యరాజ్యసమితి ఆమోదించింది. భారత స్వాతంత్య్ర సమర యోధుడు డాక్టర్ హన్స్ జీవరాజ్ మెహతాతో పాటు వివిధ దేశాలకు, సైద్ధాంతిక భావజాలాలకు చెందిన మేధావులు కలిసి ఈ ప్రకటనను రూపొందించారు. అన్ని సభ్య దేశాలు, సంస్థలను ఆహ్వానించి వాటి సమక్షంలోనే ‘అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం’పై ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 423(ఐ) తీర్మానాన్ని ఆమోదించింది. అందుకే మనం ప్రతి సంవత్సరం డిసెంబరు 10వ తేదీన మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1993లో మానవ హక్కుల అభివృద్ధి, పరిరక్షణ కోసం ఒక హైకమిషనర్‌ను ఐరాస నియమించింది.
మనదేశంలో ఇలా..
భారత్‌లో మానవ హక్కుల పరిరక్షణ చట్టాన్ని 1993లో ఆమోదించారు. నాటి ప్రధాని పీవీ నర్సింహారావు 1993 అక్టోబర్ 12న మానవ హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేశారు. మన దేశంలో 1993లో రూపొందిన మానవహక్కుల పరిరక్షణ చట్టం 1994, జనవరి 8 నుంచి అమలులోకి వచ్చింది. దేశంలో నేటికీ కొన్ని రాష్ట్రాలకు మానవ హక్కుల కమిషన్‌లు లేవు. రాజ్యాంగ హక్కులనూ, అంతర్జాతీయ సూత్రాలను ఉల్లంఘిస్తూ కొందరు పోలీసు అధికారులు ప్రజలతో అమానుషంగా వ్యవహరిస్తున్నారు. మనదేశంలోనూ కుల వ్యవస్థ, అస్పృశ్యత, అంటరానితనం నేటికీ పలుచోట్ల ఉన్నాయి. ప్రతీ రంగంలోనూ దీనికి సంబంధించిన ఆనవాళ్లు నిత్యం మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ‘మన పోరాటం డబ్బుకోసం కాదు.. అధికారం కోసం కాదు.. స్వేచ్ఛ, సమానత్వ పునరుద్ధరణే మన లక్ష్యం’ అని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చెప్పారు. స్వేచ్ఛ, సమానత్వ పునరుద్ధరణ కోసం ఈతరం యువత నడుం బిగించాల్సిన అవసరం ఉంది.
Also Read :Nagarjuna Sagar 70 Years : 70వ వసంతంలోకి నాగార్జుసాగర్ డ్యాం.. నెహ్రూ చెప్పిన ‘‘ఆధునిక దేవాలయం’’ విశేషాలివీ
సుప్రీంకోర్టు వివాదాస్పద తీర్పు
మనుషులంతా ఒక్కటే. ధనమున్నా లేకున్నా.. మతం ఏదైనా.. కులం ఏదైనా.. ప్రాంతం,దేశం ఏదైనా.. రంగు ఏదైనా.. అంతా ఒక్కటే. ఇదే నిజం. కానీ ప్రపంచంలోని చాలా దేశాల్లో ఒక్కో రకమైన దురహంకారం నేటికీ మనుగడలో ఉంది. 1857లో ‘డ్రెడ్ స్కాట్ వర్సెస్ శాండ్ ఫోర్డ్’ కేసులో అమెరికా సుప్రీంకోర్టు అక్కడి నల్లజాతీయులు దేశ పౌరులు కారని తీర్పును వెలువరించింది. దీన్నిబట్టి అప్పట్లో సుప్రీంకోర్టు ధర్మాసనంలో ఉన్న న్యాయమూర్తుల జాత్యహంకారం ఏ రేంజులో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. 1886లో అదే కోర్టు అమెరికా కంపెనీలకు కూడా దేశ పౌరసత్వాన్ని కల్పిస్తూ ఇంకో తీర్పు ఇచ్చింది. అమెరికాలో నల్లజాతీయుల కంటే అక్కడి కంపెనీలకే పౌరసత్వ హక్కులు లభించడం శోచనీయం.
Also Read :20 Wives VS Husband : 20 మంది ఆధ్యాత్మిక భార్యలు.. మత నాయకుడికి 50 ఏళ్ల జైలుశిక్ష ?
ప్రపంచంలోనే మొట్టమొదటి మానవ హక్కుల ప్రకటన
క్రీ.శ. 1215లో అప్పటి ఇంగ్లండ్ రాజు జాన్ ‘మాగ్నా కార్టా’ను విడుదల చేశారు. ప్రపంచంలోనే వెలువడిన మొట్టమొదటి మానవ హక్కుల ప్రకటన అదే. ‘న్యాయబద్ధమైన తీర్పు ద్వారా తప్ప, మరేవిధమైన పద్ధతులలోనూ పౌరుల స్వేచ్ఛను బందీ చేయడం, బహిష్కరించడం నిషేధం” అంటూ మాగ్నా కార్టాలో స్పష్టంగా ఉంది. ప్రపంచ విప్లవాలకు ఇదే నాందీ ప్రస్తావనగా మారింది.