Mission 2023 : బీజేపీ ముప్పేట దాడిని టీఆర్ఎస్ తట్టుకుంటుందా..కేసీఆర్ రాజకీయ వ్యూహం ఏంటి..?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీలు...ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ప్రజలకు చేరువయ్యేందుకు ప్లాన్ చేస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - September 11, 2022 / 07:21 PM IST

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీలు…ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ప్రజలకు చేరువయ్యేందుకు ప్లాన్ చేస్తున్నాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాది కాలం సమయం ఉన్నా…రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. సీఎం కేసీఆర్ బహిరంగ సభలు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి పాదయాత్రలు, కేంద్రమంత్రులు తరచుగా తెలంగాణలో పర్యటించడం…కాంగ్రెస్ పార్టీ పలు ప్రచారాలు..ఇవన్నీ కూడా తెలంగాణలో రాజకీయ వాతావారణాన్ని మరింత హీట్ ఎక్కిస్తున్నాయి.

అధికార టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు నిరాకరించినప్పటికీ…మూడోసారి అధికారంలోకి రావడంమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. గతంలో రెండు అసెంబ్లీ ఎన్నికల్లో 2020లో దుబ్బాక, 2021 హుజురాబాద్ లో బీజేపీ విజయం సాధించింది. ఇది అధికారపార్టీకి ఒక్కింత ఝలక్ ఇచ్చినట్లయింది. జీహెచ్ఎంసీలోనూ బీజేపీ మంచి పనితీరు కనబర్చింది. ఇది అధికార టీఆర్ఎస్ పై ఒత్తిడిని పెంచుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ బలహీనపడటం వల్ల తమకు ఎలాంటి వ్యతిరేకత ఉండదని అధికారపార్టీ భావిస్తున్న తరుణంలో బీజేపీ రూపంలో బలమైన ప్రత్యర్థి ఎదురు రావడంతో…ఇప్పుడు అధికార టీఆర్ఎస్ లో ఆందోళన మొదలైంది. రానున్న ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలను రాబడుతుందని భావిస్తున్న తరుణంలో రాష్ట్ర నాయకత్వానికి కేంద్ర పూర్తిగా మద్దతిస్తోంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ముక్కోణపు పోటీ తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ ఈ రెండు పార్టీలు కూడా అధికారపార్టీకి దీటుగా బరిలో దిగడం ఖాయమని…ఇది ఖచ్చితంగా ముక్కోణపు పోటీ అవుతుందని అభిప్రాయపడుతున్నారు.

Aslo Read : మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా గౌడ్..?

టీఆర్ఎస్ ముందున్న ఏకైక ప్రత్యామ్నాయ మార్గం తనను తాను బలపరుచుకోవడం. రెండు అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించడంతో మిషన్ 2023 లక్ష్యంతో దూకుడుగా ముందుకు సాగుతోంది. తెలంగాణ రాష్ట్నాన్ని సృష్టించిన ఘనత తమదే అంటూ చెప్పుకుంటూ రెండుసార్లు అధికారాన్ని కోల్పోయి కాంగ్రెస్…తన కంచుకోటను తిరిగి దక్కించుకోవడం అనేది ఇఫ్పుడు తన ముందున్న పెను సవాలు. నాలుగు ఉప ఎన్నికల్లో ఓటమి, డజను మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు, అంతర్గత పోరుతో 2019 నుంచి కాంగ్రెస్ పార్టీ ఎన్నో పరాజయాలను చవిచూసింది. 2023 ఎన్నికల ముందు మునుగోడు నియోజవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం కాంగ్రెస్ పార్టీని మరింతగా కష్టాల్లోకి నెట్టేసినట్లయ్యింది. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడంతో…అధికారపార్టీపై మరింత ఒత్తిడి పెంచేందుకు బీజేపీ వ్యూహాన్ని రచిస్తోంది. ఎలాగైనా ఈ ఉపఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించి..అధికారపార్టీకి చెక్ పెట్టాలని ప్లాన్ చేస్తోంది.

Aslo Read : కేసీఆర్ కు ఏపీ సీఎం జగన్ ఫిట్టింగ్ 

అటు మునుగోడు ఉపఎన్నికలో ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో అధికారపార్టీ ఉంది. 2023 ఎన్నికల ముందు మునుగోడులో విజయం సాధిస్తే…మానసికంగా ఊరట లభిస్తుందన్న నమ్మకంతో శాయశక్తులా ప్రయత్నిస్తోంది. అందుకే అమిత్ షా పర్యటనకు ఒక్కరోజు ముందే కేసీఆర్ మునుగోడులో టీఆర్ ఎస్ ప్రచారాన్ని ప్రారంభిస్తూ భారీ బహిరంగసభ నిర్వహించారు. మునుగోడులో మూడు కీలక పార్టీల మధ్య ఫైట్ కొనసాగుతుండగా…వరుసగా రెండు పర్యాయాలు విజయం దూకుడుగా ఉన్న టీఆరెస్…తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు జాగ్రత్తగా ముందుకు సాగుతోంది.

Aslo Read : ఆ పార్టీలకు అభ్యర్థులను ప్రకటించే ధైర్యం లేదు..!!

ప్రతివారం ఒక బహిరంగసభలోప్రసంగిస్తూ..జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన కలెక్టరేట్లను ప్రారంభిస్తూ…తెలంగాణ సాధించిన విజయాలకు ప్రజలకు వద్దకు తీసుకెళ్తున్నారు కేసీఆర్. బీజేపీకి వ్యతిరేకంగా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కరెంటుకొరత, 24గంటల ఉచిత విద్యుత్తు, సాగు విస్తర్ణం వంటి అంశాల్లో తెలంగాణ సాధించిన విజయాన్ని ప్రజలకు వివరిస్తూ…ప్రధాని మోదీ విధానాలను ఎక్కడిక్కడ ఎండగడుతున్నారు. టీఆర్ఎస్ కు దూరమైన ఓటర్లను తిగిరి తన గూటికి చేర్చుకునేలా ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్.

Aslo Read : పాల్వాయి స్రవంతి బలాలు, బలహీనతలు ఇవే..!!

ప్రధాని మోదీ, అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవలి కాలంలో తెలంగాణలో పర్యటనలు, వంశపారంపర్య రాజకీయాలు, అవినీతి ఆరోపణలు ఇవన్నీ కూడా బీజేపీ రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బలమైన ప్రత్యర్థిగా నిలబడుతుందని స్పష్టంగా సూచిస్తున్నాయి. కేసీఆర్ ఎన్నికల వేళ ఇచ్చి హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. మొత్తానికి బీజేపీ ముప్పేట దాడిని టీఆర్ఎస్ ఎదుర్కొంటుందా..కేసీఆర్ రాజకీయ వ్యూహం ఏంటంనేది రానున్న రోజుల్లో చూడాల్సిందే.