LK Advani : ఎల్‌కే అద్వానీ ఎవరు ? బీజేపీ దిగ్గజ నేత కెరీర్ గ్రాఫ్

ఎల్‌కే అద్వానీ.. బీజేపీలో దిగ్గజ నేత. అంతకంటే గొప్ప పదం ఏదైనా ఉన్నా ఆయన కోసం వాడొచ్చు.

  • Written By:
  • Publish Date - June 27, 2024 / 08:43 AM IST

LK Advani : ఎల్‌కే అద్వానీ.. బీజేపీలో దిగ్గజ నేత. అంతకంటే గొప్ప పదం ఏదైనా ఉన్నా ఆయన కోసం వాడొచ్చు. బీజేపీలో అద్వానీకి అంతటి గొప్ప స్థానం ఉంది. 1980 ఏప్రిల్‌ 6న వాజ్‌పేయీ, అద్వానీ కలిసి భారతీయ జనతా పార్టీని స్థాపించారు. 1996లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2019 సంవత్సరం నుంచి క్రియాశీల రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్న అద్వానీ కెరీర్ గ్రాఫ్ గురించి తెలుసుకోవాలంటే మనం ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లాల్సిందే..

We’re now on WhatsApp. Click to Join

అద్వానీ కెరీర్ గ్రాఫ్

  • 1927 నవంబరు 8న అవిభక్త భారత్‌లోని కరాచీ (ప్రస్తుతం పాక్‌లో ఉంది)లో అద్వానీ జన్మించారు.
  • కరాచీలోనే ఉన్న సెయింట్‌ పాట్రిక్స్‌ హైస్కూల్‌లో అద్వానీ(LK Advani) పాఠశాల విద్య అభ్యసించారు.
  • 1941లో పద్నాలుగేళ్ల వయసులో అద్వానీ రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్ఎస్ఎస్‌‌)లో చేరారు.
  • 1947లో ఆర్ఎస్ఎస్  కరాచీ విభాగం కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు.
  • పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌లో ఉన్న డీజీ నేషనల్‌ కాలేజీలో న్యాయవిద్య పూర్తి చేశారు.
  • దేశ విభజన తర్వాత అద్వానీ కుటుంబం 1947 సెప్టెంబర్ 12న పాకిస్థాన్‌ను విడిచిపెట్టి భారతదేశానికి వచ్చి ముంబైలో స్థిరపడింది.
  • 1951లో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జన్ సంఘ్ స్థాపించారు.
  • జన్ సంఘ్ ప్రారంభించినప్పటి నుంచి  1957 వరకు పార్టీ కార్యదర్శిగా అద్వానీ ఉన్నారు.
  • తొలుత రాజస్థాన్‌లో సంఘ్‌ ప్రచారక్‌గా అద్వానీ పనిచేశారు.
  • 1957లో ఢిల్లీకి వెళ్లి జన్‌సంఘ్‌ ప్రధాన కార్యదర్శిగా  ఆయన బాధ్యతలు చేపట్టారు.
  • అద్వానీ 1965 ఫిబ్రవరి 25న కమల అద్వానీని వివాహం చేసుకున్నారు.
  • 1966లో ఢిల్లీ మెట్రోపాలిటన్‌ కౌన్సిల్‌ మధ్యంతర ఎన్నికల్లో అద్వానీ గెలిచారు. 1967లో ఆ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా గెలిచారు.
  • 1970-72లో భారతీయ జనసంఘ్‌ ఢిల్లీ విభాగం అధ్యక్షుడిగా అద్వానీ వ్యవహరించారు.
  • అద్వానీ 1970లో ఢిల్లీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి ఎన్నికయ్యారు.
  • 1973 నుంచి 1977 వరకు జన్ సంఘ్ అధ్యక్షుడిగా అద్వానీ పనిచేశారు.
  • 1976లో గుజరాత్‌ నుంచి రెండోసారి రాజ్యసభకు వెళ్లారు.
  • 1977-80లో జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ పార్టీ ప్రభుత్వంలో 1977-79 మధ్య కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు.
  • 1980లో జనతా పార్టీ ఓటమి పాలైన అనంతరం రాజ్యసభలో కొంతకాలం పాటు ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు.
  • 1980 ఏప్రిల్‌ 6న వాజ్‌పేయీతో కలిసి భారతీయ జనతా పార్టీని అద్వానీ స్థాపించారు.
  • 1982లో మధ్యప్రదేశ్‌ నుంచి మూడోసారి రాజ్యసభకు అద్వానీ ఎన్నికయ్యారు.
  • అద్వానీ 1980 నుంచి 1986 వరకు బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, 1986 నుంచి 1991 వరకు బీజేపీ అధ్యక్షుడిగా వర్క్ చేశారు.
  • 1990వ దశకంలో అయోధ్య రామజన్మభూమి ఉద్యమాన్ని అద్వానీ ముందుండి నడిపారు.  పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి అయిన సెప్టెంబర్ 25న 1990వ సంవత్సరంలో సోమనాథ్ నుంచి రామ్ రథయాత్ర ప్రారంభమైంది.
  • రామ్ రథయాత్ర 10,000 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత అక్టోబర్ 30న అయోధ్యలో అది ముగియాల్సి ఉంది. రామ మందిరాన్ని నిర్మించాలనే ప్రచారానికి మద్దతు పొందడమే ఈ యాత్ర ఉద్దేశం.
  • 1996లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. వాజ్‌పేయీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆ ప్రభుత్వం 13 రోజులకే కూలిపోయింది.
  • 1998లో మిత్రపక్షాలతో కలిసి బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
  • 1999లో జరిగిన ఎన్నికల్లో గాంధీనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి అద్వానీ గెలిచారు.
  • 2004 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడంతో అద్వానీ ప్రతిపక్ష నాయకుడిగా నియమితులయ్యారు. లోక్‌సభలో సుదీర్ఘకాలం పాటు ప్రతిపక్ష నేతగా పనిచేశారు.
  • 2009 ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా అద్వానీ పోటీచేశారు. కానీ, ఆ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది.
  • 2014లో మరోసారి గాంధీనగర్‌ నుంచి అద్వానీ గెలిచినప్పటికీ.. ఆయన రాజకీయాలలో యాక్టివ్‌గా వ్యవహరించలేదు.
  • 2019 నుంచి క్రియాశీల రాజకీయాలకు పూర్తిగా దూరంగా అద్వానీ ఉంటున్నారు.
  • అద్వానీ తన కెరీర్‌లో మూడుసార్లు బీజేపీ అధ్యక్షుడిగా, ఐదుసార్లు లోక్‌సభ ఎంపీగా, నాలుగు సార్లు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు.
  • ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ 1999లో అత్యుత్తమ పార్లమెంటేరియన్ అవార్డును అద్వానీకి అందజేసింది.
  • ఎల్‌కే అద్వానీ దేశ అత్యున్నత పౌర గౌరవ పురస్కారమైన భారతరత్నను ఈ ఏడాది 2024లోనే స్వీకరించారు. ఎల్‌కే అద్వానీ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో ఆయన  నివాసానికి వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతరత్నతో సత్కరించారు.

Also Read :LK Advani : ఎల్​కే అద్వానీకి అస్వస్థత.. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స

ఎల్‌కే అద్వానీ రాసిన పుస్తకాలు

  • మై కంట్రీ మై లైఫ్ (2008)
  • ఎ ప్రిజనర్స్ స్క్రాప్-బుక్ (1978)
  • నజర్‌బంద్ లోక్ తంత్ర (2003)
  • న్యూ అప్రోచెస్ టు సెక్యూరిటీ అండ్ డెవలప్మెంట్ (2003)
  • యాజ్ ఐ సీ ఇట్ (2011)
  • మై టేక్ (2021)

Also Read : Ration Cards: త్వరలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ షురూ