Thummala Political Career : తుమ్మల పరిస్థితి ఏంటి..?

  • Written By:
  • Updated On - August 22, 2023 / 06:21 PM IST

తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) పరిస్థితి ఏంటి..? ఇప్పుడు ఖమ్మం జిల్లా అంత ఇలాగే మాట్లాడుకుంటున్నారు. ఖమ్మం జిల్లా (Khammam District) రాజకీయాల్లో తుమ్మలది విశిష్ట స్థానము. రాష్ట్రంలోని ప్రధాన పార్టీని ఒంటిచేత్తో మూడు దశాబ్దాల పాటు ఆయన నడిపించారు. టీడీపీ పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఆయన రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. తన అనుచరులను ఎందరినో నాయకులుగా తీర్చిదిద్దారు. 1982 సెప్టెంబరులో చర్ల మండలం ఏటుపాక గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.

ఆయనకు రాజకీయ జన్మనిచ్చింది సత్తుపల్లి నియోజకవర్గం(Sathupalli Constituency). పూర్వ సత్తుపల్లి నియోజకవర్గంలోని దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామానికి చెందిన ఆయన తన రాజకీయాలను అక్కడి నుంచే ప్రారంభించారు. టీడీపీ (TDP) స్థాపించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లోనే ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన ఓటమి చవిచూశారు. మళ్లీ ఏడాదిన్నరకే 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించారు. అప్పుడే ఆయనకు ఎన్టీఆర్ కాబినెట్లో స్థానం ఇచ్చారు. ఆయన 1985,1994,1999,2009 ఎన్నికల్లో టీడీపీపార్టీ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

2014లో జరిగిన ఎన్నికల్లో కూడా టిడిపి నుండి పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత బిఆర్ఎస్ పార్టీలో చేరాడు. అనంతరం ఆయనుకు బిఆర్ఎస్ (BRS) పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. కేసీఆర్ మంత్రివర్గంలో ఆయన ఆర్‌అండ్‌బీ, స్త్రీ, శిశు సంక్షేమశాఖల మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు. 2016లో పాలేరు ఉపఎన్నికలో పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి రాంరెడ్డి సుచరితపై 45,684 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.

2018 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీలో తుమ్మల ప్రభావం క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. అయినప్పటికీ తుమ్మల ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పట్టుకోల్పోలేదు సరికదా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పని చేసి ప్రతికూల పరిస్థితుల్లో కూడా తన క్యాడర్ ను కాపాడుకుంటూ వచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు కేసీఆర్, కేటీఆర్ లకు తుమ్మలను దూరం చేశారని తుమ్మల అభిమానులు ఆందోళన చెందారు.

కానీ ఈసారి తుమ్మల కు కేసీఆర్ ఛాన్స్ ఇస్తారని అంత అనుకున్నారు. కానీ నిన్న ప్రకటించిన బిఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ (BRS Candidates List) లో తుమ్మల పేరు ప్రకటించకపోవడం తో ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం తుమ్మల నాగేశ్వరరావు కు మాత్రమే కాదు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావుకు టికెట్లు దక్కకపోవడం పట్ల జిల్లా రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఈసారి పాలేరు నుంచి తుమ్మలకు అవకాశం కచ్చితంగా ఉంటుందని, సర్వేల్లోనూ ఆయనకే మొగ్గు ఉందన్న ప్రచారం జరిగింది. కానీ గత ఎన్నికల్లో కాంగ్రెస్‌లో గెలిచి బీఆర్‌ఎస్‌‌లో చేరిన కందాల ఉపేందర్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ టికెట్‌ కేటాయించడంతో పాలేరు టికెట్‌పై ఆశపెట్టుకున్న తుమ్మల భవితవ్యం ఏంటా అన్న చర్చ జరుగుతోంది.

ఇదిలా ఉంటె మంగళవారం ఖమ్మం సత్యనారాయణపురంలోని ఓ ఫంక్షన్ హాల్లో తుమ్మల అభిమానుల సమావేశం అయినట్లు తెలుస్తుంది. ఈ సమావేశంలో జరిగిన అభిప్రాయ సేకరణ తుమ్మల ఎదుట ఉంచుతామని, తుమ్మల బాటలోనే నడుస్తామని అనుచరుల స్పష్టం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా నుంచి హైదరాబాద్‌కు భారీగా తరలి వెళ్లి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావును కలిసే యోచనలో ముఖ్య నాయకులు ఉన్నట్లు వినికిడి.

ఇక జలగం వెంకటరావు విషయానికి వస్తే..మొన్నటి వరకు తనకు కొత్తగూడెం అభ్యర్థిత్వం దక్కుతుందని ధీమాగా వ్యక్తం చేయగా..కేసీఆర్ మాత్రం మరోసారి వనామకే టికెట్ ఇవ్వడం తో వెంకటరావు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు వినికిడి. ఇప్పటికే కొత్తగూడెం టికెట్‌ విషయంలో కాంగ్రెస్‌నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రంగంలో ఉండటంతో.. ఒకవేళ పొంగులేటి పాలేరు లేదా ఖమ్మం వైపు వస్తే జలగం వెంకటరావు కాంగ్రెస్‌లో చేరి కొత్తగూడెం అభ్యర్థిగా రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికి ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ హావ లేదు అని అనుకుంటున్న సమయంలో తుమ్మలకు , జలగం వెంకటరావు లకు టికెట్ ఇవ్వక పోవడం పార్టీ కి తీవ్ర నష్టం వాటిల్లడం ఖాయమని అంత మాట్లాడుకుంటున్నారు.

Read Also : MLA Rajaiah: బోరున ఏడ్చిన రాజయ్య, కేసీఆర్ తోనే ఉంటానంటూ!