Site icon HashtagU Telugu

Robbery Gangs : వామ్మో.. ఆ 3 గ్రామాలు.. దొంగల ముఠాల అడ్డాలు

Robbery Gangs Of Madhya Pradesh Villages

Robbery Gangs : మధ్యప్రదేశ్, ఒడిశా, బిహార్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని కొన్ని గ్రామాలు దొంగలకు అడ్డాలుగా ఉన్నాయి. ఆయా గ్రామాలలోనే  దొంగల ముఠాలు పర్మినెంటుగా నివసిస్తుంటాయి. అయితే ఏటా మూడు, నాలుగు నెలల పాటు దేశంలోని పలు రాష్ట్రాలకు వెళ్లి ఈ ముఠాలు లూటీలు, చోరీలకు తెగబడుతుంటాయి. దోచుకున్న డబ్బును తెచ్చుకొని ఏడాదిలోని మిగతా నెలలను హాయిగా జీవితాన్ని గడిపేస్తారు. ఇలాంటి  రకానికే చెందిన మూడు గ్రామాలను తాజాగా మధ్యప్రదేశ్‌‌లోని రాజ్‌గఢ్‌ జిల్లాలో గుర్తించారు. ఆ గ్రామాల పేర్లు కడియా సాంసీ, గుల్ఖేడీ, హుల్ఖేడీ(Robbery Gangs). వివరాలివీ..

We’re now on WhatsApp. Click to Join

కడియా సాంసీ, గుల్ఖేడీ, హుల్ఖేడీ గ్రామాల సగటు జనాభా 5000 మాత్రమే. ఈ ఊళ్లకు చెందిన బాలురు, బాలికలు, పురుషులు, స్త్రీలపై దేశవ్యాప్తంగా దాదాపు 2వేల దాకా క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. ప్రత్యేకించి కడియా సాంసీ గ్రామంలో కరుడుగట్టిన నేరగాళ్లు ఉంటారని చెబుతారు. గత ఆరు నెలల్లో ఈ ముఠాలకు చెందిన 25 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.4.37 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అయితే కడియా సాంసీ, గుల్ఖేడీ, హుల్ఖేడీ గ్రామాల్లోకి వెళ్లి పోలీసులు ఎవరినైనా అరెస్టు చేయడం అంత ఈజీ కాదు. అరెస్టు చేసే క్రమంలో గ్రామస్తులంతా పోలీసులపైకి తిరగబడతారు. ఓ కేసును విచారించే క్రమంలో ఇటీవలే తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి ఈ ఊరికి వచ్చిన పోలీసుల టీమ్‌పై ఇలాగే దాడి చేశారు.

Also Read :Sheikh Hasina : ఢిల్లీలోనూ బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం ప్రక్షాళన.. ఏం చేసిందంటే..

ఆగస్టు 8వతేదీన రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో తెలంగాణకు చెందిన ఓ వ్యాపారి కుమారుడి పెళ్లి జరిగింది. ఈ పెళ్లి జరుగుతుండగా ఓ భారీ చోరీ జరిగింది. రూ.1.45 కోట్లు విలువైన ఆభరణాలు కలిగిన సంచిని ఎవరో చోరీ చేశారు. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తే ఓ 14 ఏళ్ల బాలుడు ఆ సంచిని దొంగిలించినట్లు తేలింది. ఇలాంటి చోరీలకు పాల్పడే అలవాటు మధ్యప్రదేశ్‌‌లోని రాజ్‌గఢ్‌ జిల్లాకు చెందిన దొంగల ముఠాలకు  ఉంది. ఈవిషయం రాజస్థాన్ పోలీసులకు కూడా బాగా తెలుసు. అందుకే వారు వెంటనే రాజ్‌గఢ్‌ జిల్లా పోలీసులను అలర్ట్ చేశారు. వారు రంగంలోకి దిగి  ఆభరణాల సంచితో రాజ్‌గఢ్‌ జిల్లాలోకి ప్రవేశించిన బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. సంచిని స్వాధీనం చేసుకొని 24 గంటల్లోనే సదరు తెలంగాణ వ్యాపారికి అప్పగించారు.