Secretariat: సాగనతీరాన అందాలసౌథం… తెలంగాణ సెక్రటేరియట్ ప్రత్యేకతలెన్నో

ఓ వైపు బుద్ధుడి విగ్రహం.. మరోవైపు ఎత్తయిన అంబేద్కర్‌ విగ్రహం...రెండు విగ్రహాల మధ్య నూతన సచివాలయ భవనం...ఎన్నో ప్రత్యేకతలతో హుస్సేన్‌సాగర తీరాన.. సరికొత్త సచివాలయం ప్రారంభానికి ముస్తాబవుతోంది

  • Written By:
  • Updated On - April 29, 2023 / 10:23 AM IST

Secretariat: ఓ వైపు బుద్ధుడి విగ్రహం.. మరోవైపు ఎత్తయిన అంబేద్కర్‌ విగ్రహం…రెండు విగ్రహాల మధ్య నూతన సచివాలయ భవనం…ఎన్నో ప్రత్యేకతలతో హుస్సేన్‌సాగర తీరాన.. సరికొత్త సచివాలయం ప్రారంభానికి ముస్తాబవుతోంది. అత్యాధునిక సౌకర్యాలు, సువిశాలమైన గదులతో తుది మెరుగులు దిద్దుకుంటోంది.

హైదరాబాద్‌ (Hyderabad) హుస్సేన్‌సాగర్‌ తీరంలో ఓ భారీ భవన సముదాయం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మునుపెన్నడూ ఎవ్వరూ ఊహించని విధంగా.. ఓ సరికొత్త అందమైన కట్టడం ఆవిష్కృతం కావడం.. చారిత్రక నగరానికి మరో అందాన్ని తీసుకొచ్చింది. ఇండో పర్షియన్‌ నిర్మాణ శైలితో నిలువెల్లా అత్యాధునిక టెక్నాలజీని నింపుకున్న ఆ భవనం.. చూడటానికి తాజ్‌మహల్లా..మరో మైసూర్‌ ప్యాలెస్‌లా కనువిందు చేస్తోంది. తెలంగాణ నూతన సెక్రటేరియట్‌ సుమారు 635 గదులు, 30 సమావేశ మందిరాలు, 34 గుమ్మటాలతో కళ్లు మిరుమిట్లు గొలిపేలా తీర్చిదిద్దబడ్డ అద్భుత కట్టడం. మొత్తం ఆరు అంతస్తుల్లో దీన్ని నిర్మించారు. ప్రధాన గుమ్మటం వద్ద మరో ఐదు అంతస్తులతో 11 అంతస్తుల నిర్మాణంగా ఉంటుంది. తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణం మొత్తం 28 ఎకరాల్లో తీర్చిదిద్దారు. ఇందులో భవనాల విస్తీర్ణం రెండున్నర ఎకరాలు కాగా, ముందువైపు 10 ఎకరాల్లో పచ్చక మైదానం , కోర్ట్ యార్డులో 2 ఎకరాల్లో లాన్‌ ఏర్పాటు చేశారు. మొత్తంగా చూస్తే 90 శాతం ఖాళీ ప్రదేశముంటే మిగిలిన 10 శాతంలోనే భవనాలను నిర్మించారు. ఇది దేశంలోనే అతిపెద్ద సచివాలయాల్లో ఒకటిగా పేరు పొందనుంది. ఢిల్లీలో కొత్త పార్లమెంట్‌ భవనం సెంట్రల్‌ విస్టా కూడా ఇంతే విస్తీర్ణంలో ఉంది.

ఈ భవనాన్ని రికార్డ్‌ స్థాయిలో 26 నెలల్లోనే పూర్తిచేశారు. అయితే మధ్యలో కోవిడ్‌ కారణంగా ఆరు నెలలపాటు సమయం వృథా అవడంతో కేవలం 20 నెలల్లోనే ఇంత పెద్ద నిర్మాణాన్ని నిర్మించినట్టయింది. ఈమొత్తం కట్టడాన్ని తీర్చి దిద్దడానికి మొత్తం 4 వేలమంది కార్మికులు పగలు రాత్రి కష్టపడ్డారు. ఈ భవనం మొత్తం ఎత్తు 265 అడుగులు కాగా కుతుబ్‌మినార్‌ ఎత్తు 239 అడుగులుగా ఉంది. కొత్త సెక్రటేరియట్‌ రెండు ప్రధాన గుమ్మటాల మీద ఏర్పాటు చేసిన అశోక చిహ్నాల్లో ఒక్కోదాని ఎత్తు 14 అడుగులు. కాగా తెలంగాణ నూతన సెక్రటేరియట్‌ నిర్మాణానికి 617 కోట్లకు అప్పట్లో అనుమతులిచ్చారు. అయితే జీఎస్టీ ఇప్పుడు పెరిగిపోవడంతో నిర్మాణ వ్యయం 30 శాతం భారీగా పెరిగింది. ఇన్ని ప్రత్యేకతలున్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభానికి టీ సర్కార్‌ అన్ని ఏర్పాట్లు చకచకా పూర్తి చేస్తుంది.

ఈనెల 30న ఉదయం 6 గంటలకు సూర్యోదయ వేళ సీఎం కేసీఆర్‌ సుదర్శనయాగం చేయనున్నారు. ఇది మధ్యాహ్నం 1.20 నుంచి 1.30 గంటల మధ్య పూర్ణాహుతితో ముగియనుంది. ఆ తర్వాత సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా దీన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1 గంట 58 నిమిషాల నుంచి 2 గంటల 4 నిమిషాల మధ్య కాలంలో మంత్రులందరూ తమ తమ ఛాంబర్లలో కొలువుదీరనున్నారు. మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు కొత్త సచివాలయం ప్రాంగణంలో సమావేశం ఉంటుంది. సచివాలయ ఉద్యోగులు, అతిథులు, సందర్శకులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు.ఆ తర్వాత అధికారులు, ఇతర సిబ్బంది తమ తమ స్థానాల్లో కొలువుదీరనున్నారు. ఏ ఫ్లోర్‌లో ఏయే శాఖలు ఉండాలనేది ఇప్పటికే కేటాయింపులు చేశారు. షిఫ్టింగ్ పనులు కూడా ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 30వ తేదీ నుంచి సమీకృత కొత్త పరిపాలనా సౌధం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని అధికారులు తెలిపారు.

Read More: Chetak: చేతక్ స్కూటీలు మరింత తొందరగా.. బజాజ్ కీలక నిర్ణయం