75 Years Parliament Journey : రేపటి (సెప్టెంబరు 18) నుంచి భారత పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగబోతున్నాయి. ఈనెల 22 వరకు జరగనున్న స్పెషల్ సెషన్ లో తొలిరోజు ప్రధాన చర్చ 75 ఏళ్ల భారత పార్లమెంటు ప్రస్థానంపై జరిగే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో గత ఏడున్నర దశాబ్దాలలో భారత పార్లమెంటు తీసుకొచ్చిన సంస్కరణలు, ఆ సంస్కరణలతో వచ్చిన ఫలితాలు, సాధించిన మైలురాయిలకు సంబంధించిన ముఖ్య అంశాలను 5 పాయింట్లలో తెలుసుకుందాం..
Also read : Pawan Kalyan: అటు కమలం.. ఇటు కామ్రేడ్స్.. మధ్యలో పవన్..!
- మన దేశంలో 66 శాతం జనాభా 35 ఏళ్లలోపు వారే. కానీ 545 మంది సభ్యులున్న లోక్‌సభలో 35 ఏళ్లలోపు వయసున్న ఎంపీలు కేవలం 21 మంది మాత్రమే ఉన్నారు. అంటే 35 ఏళ్లలోపు యూత్ కు రాజకీయ పార్టీలు ఇస్తున్న అవకాశాలు చాలా తక్కువ. ఇప్పటితో పోలిస్తే 1952లోనే యూత్ ఎంపీల సంఖ్య ఎక్కువ. మన దేశానికి జరిగిన తొలి లోక్ సభ ఎన్నికల్లో 35 ఏళ్లలోపు ఎంపీలు 82 మంది ఎన్నికయ్యారు. ప్రస్తుతం లోక్‌సభ ఎంపీల సగటు వయసు 55 ఏళ్లు.
- మన దేశ తొలి లోక్ సభ ఎన్నికల్లో 22 మంది మహిళలు ఎన్నికవగా, ప్రస్తుతం లోక్ సభలో అత్యధికంగా 78 మంది మహిళలు ఉన్నారు. 1952 తొలి లోక్‌సభ ఎన్నికల్లో 45 మంది స్త్రీలు పోటీచేయగా.. 2019 లోక్ సభ ఎన్నికల్లో అత్యధికంగా 726 మంది మహిళలు పోటీపడ్డారు.
- లోక్ సభ, రాజ్యసభల్లో ప్రజా సమస్యలపై చర్చించే టైం తగ్గుతోంది. 1974 దాకా లోక్‌సభ ఏటా 100 రోజులకు తక్కువ కాకుండా సమావేశమయ్యేది. 2020లో అత్యల్పంగా లోక్‌సభ, రాజ్యసభ 33 రోజులే పని చేశాయి. ప్రస్తుత లోక్‌సభ ఏటా సగటున 58 రోజులే సమావేశమవుతోంది.
- ప్రస్తుతం పార్లమెంటులో బిల్లుల ఆమోదం తగ్గి, ఆర్డినెన్సుల జారీ పెరిగింది. మోడీ ప్రభుత్వం వచ్చాక సభ నిర్వహణలో అంతరాయం కారణంగా ఆర్డినెన్సులు పెరిగాయి. 1952 నుంచి 1965 దాకా ప్రభుత్వ ఆర్డినెన్సులు ఏ ఏడాదిలోనూ రెండంకెలను దాటలేదు.
- చట్టసభల్లో ప్రశ్నోత్తరాల టైం డౌన్ అవుతోంది. 1952లో ఏర్పడిన తొలి లోక్‌సభలో మొత్తం సమయంలో 15% (551 గంటల 51 నిమిషాలు) ప్రశ్నోత్తరాలకు కేటాయించారు. ఇప్పుడు లోక్ సభ టైంలో 10 శాతం మాత్రమే ప్రశ్నోత్తరాలకు (75 Years Parliament Journey) కేటాయిస్తున్నారు.