Site icon HashtagU Telugu

Sankranti Special: ఆశల దీపాలు సంక్రాంతి ముగ్గులు

Sankranti Special

Sankranti Special

డా.ప్రసాదమూర్తి

Sankranti Special: పండగలు, పబ్బాలు, పర్వదినాలు పేరు ఏం పెట్టినా అవి ఊరువాడా సామూహికంగా జరుపుకునే ఒక ఉత్సాహ సంబరానికి సంకేతాలే. మకర సంక్రాంతి పౌరాణిక విశేషాలు, విశిష్టతలు ఎన్నో ఉన్నాయి. ధనుర్మాసం గురించి భారతీయ సమాజంలో ముఖ్యంగా దక్షిణాది ప్రజల్లో ఎంతో పవిత్రమైన అభిప్రాయాలు ఉన్నాయి. సూర్యుడు మకర రాశి నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశించే కాలం అతి పవిత్రమైనదిగా మన వారి భావన. ఈ పౌరాణికమైన, వ్యాఖ్యానాలు, అభిప్రాయాలు, మతపరమైన విశేషాలు, విశ్లేషణలు ఎన్ని ఉన్నప్పటికీ సంక్రాంతి పండుగ అంటే అదొక సామూహిక సంబరమే.

వివిధ జాతుల వివిధ మతాల వివిధ కులాల వివిధ వర్గాల ప్రజలు వారి వారి స్థాయికి తగినట్టు తమ తమ బంధుమిత్రులతో అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ ఈ సంక్రాంతి. అయితే కాలక్రమంలో పండుగ పరమార్థం క్రమంగా మారుతూ వస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ పండుగను ఇంకా సాంప్రదాయకంగా అందరూ జరుపుకుంటారు. పిండి వంటలు, భోగిమంటలు, రంగవల్లులు,డూడూ బసవన్నలు, హరిదాసులు ఇలా సంప్రదాయక పర్వదిన పరంపర సాగుతూనే ఉంది. కానీ పండగంటే కోడిపందాలని, జూదమని అర్థం చెప్పే విధంగా మన వారి ఆచారాలు మారిపోతున్నాయి. ఏది ఎలా ఉన్నా సంక్రాంతి పండుగకు దేశ విదేశాల నుంచి తమ తమ ఊళ్ళకు, ఇళ్లకు ప్రజలు బయలుదేరి వెళ్లి బంధుమిత్రులతో సకల సంతోషాలను పంచుకుని పండుగ జరుపుకునే పద్ధతి ఇంకా మిగిలి ఉన్నందుకు సంతోషించాలి. ఈ పండగలో అతి ముఖ్యమైనది, వయసులో ఉన్న ఆడపిల్లలు, పెద్దవాళ్లు, ముత్తయిదువలు ఇళ్ళ ముందు పెట్టే రంగురంగుల ముగ్గులు. ఈ రంగవల్లుల పరమార్థం గురించి నేను రాసిన కవిత ఇది చదవండి.

|| ఆశా దీపాల ముగ్గులు ||
ముగ్గు ముదితల చేతి వేళ్ల నుంచి జారిపడుతున్నట్టు కనిపిస్తుంది కదా!
కాదు.. ముగ్గంటే
ఆడవాళ్ళ అంతరంగపుటాకాశాల
నక్షత్రాల కాంతి ధూళి-
అది ఏడేడు లోకాల నుండి
ఈ నేలకు రాలి పడుతుంది

వాకిలి ఊడ్చి కళ్ళాపి జల్లి
ఇంటి ముందు ఒక అమ్మాయి ముగ్గు పెట్టడం అంటే
ఆమె నడుం మీద వాలిన ఇంద్రధనస్సు
కిందికి తొంగి చూసి సప్తవర్ణాలలో సంబరంగా నవ్వడమే-

పండగ నెల పట్టగానే కాల పురుషుడు ముగ్గురాళ్లు పొడిచేసి ముదితలకు కానుకగా ఇస్తాడు
ఎన్నెన్ని యుగాలుగా స్త్రీల స్వప్నాలు ఎన్నెన్ని రంగుల్ని పోగేసుకుంటాయో
చెంగుచెంగున గెంతే
ఆ రంగుల కలలే
ఈ రంగవల్లికలు-

ఇవి కేవలం ముగ్గులు కాదు
మట్టి దేహం మీద
అతివల ఆత్మ సంతకాలు
ఇవి నేల కాగితం మీద
మహిళల మహా రచనలు

ముగ్గులంటే
పడుచు పిల్లల కోటి కోటి జన్మల
లేత లేత సిగ్గులు-
ముగ్గులంటే
సకల చరాచర సంసారం బుగ్గల మీద
అమ్మవ్వలు తీర్చి దిద్దే శుభాశీస్సుల
రంగుల ఉషస్సులు-
ఇంటి నుంచి ఇంటికి వీధి నుంచి వీధికి
ఊరు నుంచి ఊరికి
సకల సంతోషాల సంగమ సంగీతాల
వెన్నెల జల్లులే రంగవల్లులు

గీతలు గీతలుగా రేఖలు రేఖలుగా
రంగులు రంగులుగా
మనుషుల్ని కలపడమే
సంక్రాంతి ముగ్గు సందేశం

అనంత మానవలోక
సుఖశాంతుల కాంతి కోసం
కేవలం స్త్రీలు మాత్రమే
ప్రపంచం వాకిలి ముందు
వెలిగించే ఆశాదీపాలు
ఈ ముగ్గులు

Also Read: Beauty Tips: అవాంఛిత రోమాలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే?