Journey of Mohammed Siraj: ఆసియా కప్ 2023 ఫైనల్‌లో ఆరు వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు హైదరాబాదీ కుర్రాడు మహ్మద్ సిరాజ్. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన సిరాజ్ ఇన్నింగ్స్ ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ గా చరిత్రకెక్కాడు. హైదరాబాద్ పాతబస్తీలో సాధారణ కుటుంబంలో జన్మించిన మహ్మద్ సిరాజ్ నగరంలోని వీధుల్లో క్రికెట్ ఆడేవాడు.
సిరాజ్ తండ్రి గౌస్ ఆటో డ్రైవర్‌గా పని చేసేవారు. తండ్రికి సాయంగా ఉండేందుకు సిరాజ్ కొన్నాళ్ళు రంగులు వేసే పనికి వెళ్ళాడు. కానీ ఎంచుకున్న క్రికెట్ ని ఏనాడూ వదులుకోవాలని అనుకోలేదు. సిరాజ్ కుటుంబం హైదరాబాద్ మసాబ్ ట్యాంక్ సమీపంలోని ఇరుకైన అద్దె ఇంట్లో ఉండేవారు. శిక్షణ లేని సిరాజ్ 140 వేగంతో బౌలింగ్ వేయడాన్ని గమనించిన కోచ్ అద్నాన్ చేయందించాడు. ఆయన ప్రోత్సాహంతో లీగ్ స్థాయి క్రికెట్ లోకి అడుగుపెట్టి 50 వికెట్లు పడగొట్టి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ దృష్టిలో పడ్డాడు. అలా రంజీలు, ఐపీఎల్, ఇప్పుడు టీమిండియాలో చోటు సంపాదించాడు.
ఎక్కడో హైదరాబాద్ విధుల్లో బంతి పట్టిన సిరాజ్ ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో రాణిస్తున్నాడు. జీవితంలో ఎన్నో బాధలు, కష్టాలు. కానీ అవేం అతని విజయానికి అడ్డుపడలేదు. గెలుపే లక్ష్యంగా సాగిన సిరాజ్ జీవితం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా మలుపు తిరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) అతన్ని ఐపిఎల్ వేలంలో కొనుగోలు చేసింది. దాంతో సిరాజ్ మళ్ళీ వెనుదిరిగి చూడలేదు. ఆ తర్వాత భారత క్రికెట్ జట్టులో స్థానం సంపాదించాడు.
హైదరాబాద్ గల్లీలో క్రికెట్ ఆడడం నుండి భారత జట్టు అత్యుత్తమ బౌలర్‌లలో ఒకరిగా మారడం వరకు మహ్మద్ సిరాజ్ చేసిన ప్రయాణం భవిష్యత్తు ఆటగాళ్లకు ఆదర్శం. 2020లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు సిరాజ్ తండ్రి మరణించాడు. ఆ సమయంలో సిరాజ్ టీమ్ ఇండియాతో ఆస్ట్రేలియాలో ఉన్నాడు. తన తండ్రి అంత్యక్రియలకు కూడా హాజరు కాలేకపోయాడు. ఇలా జీవితంలో విజయం వరించిన ప్రతిసారి ఎదో ఒక సమస్య వెంటాడుతూనే ఉండేది. సిరాజ్ జీవితాన్ని గమనిస్తే కలలకు హద్దులు ఉండవని గుర్తుచేస్తుంది.