Panchayat Elections : తెలంగాణలోని గ్రామ పంచాయతీల పాలకవర్గం గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1తో ముగియనుంది. ఆ లోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. నూతన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పంచాయతీ రాజ్ సంస్థల పాలనా కాలం ముగియడానికి మూడు నెలల ముందే ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో జనవరిలో లేదా ఫిబ్రవరిలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల షెడ్యూల్ సహా ప్రతిపాదనలను పంపామని తెలంగాణ ఎన్నికల సంఘం వర్గాలు వెల్లడించాయి. సర్పంచులు, వార్డు పదవుల వివరాలను గతంలోనే పంపించగా.. తాజాగా ఎన్నికల నిర్వహణకు సిబ్బంది వివరాలను పంపించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
We’re now on WhatsApp. Click to Join.
224 నూతన గ్రామపంచాయతీల ఫైల్ పెండింగ్
ఇటీవల శాసన సభ ఎన్నికల్లో పాల్గొన్న సిబ్బంది వివరాలు రెడీగా ఉండడంతో.. ఆ సమాచారాన్ని టీ-పోల్ వెబ్‌సైట్‌లో నమోదు చేసే పనిలో ఉన్నారు. త్వరలోనే వారికి శిక్షణ కూడా ఇవ్వనున్నారు. రాష్ట్రంలో మెుత్తం 12,769 గ్రామపంచాయతీలు ఉన్నాయి. రాష్ట్రంలో 224 నూతన గ్రామపంచాయతీల ఏర్పాటుకు సంబంధించిన బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే సమయం వరకు 224 నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు ఫైల్‌పై గవర్నర్ సంతకం పెడితే మొత్తం 12,769 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి. కాగా, దాదాపు నెల రోజుల పాటు పంచాయతీ ఎన్నికల ప్రక్రియ సాగనుంది. వచ్చే మార్చి, ఏప్రిల్‌లలో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వాటికి ఏర్పాట్లు చేయాల్సి ఉన్నందున.. ఈలోగా పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదనే వాదన వినిపిస్తోంది.
Also Read: Hollywood – 100 Years : హాలీవుడ్ సైన్ బోర్డ్ 100వ బర్త్ డే.. ఎంత చరిత్ర ఉందంటే ?
రిజర్వేషన్లపై సస్పెన్స్
గ్రామపంచాయతీ ఎన్నికల కోసం(Panchayat Elections) సిద్ధమవుతున్న స్థానిక నేతలు రిజర్వేషన్ గురించి ఆలోచనలో పడ్డారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, జనరల్, మహిళా రిజర్వేషన్ ఆశావాహులు సర్పంచ్ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని, ఉప కులాల వారీగా రిజర్వేషన్లు ఇస్తామని ప్రతిపాదించింది. ఆరు నెలల్లో దీనికి సంబంధించి బీసీ కమిషన్ నివేదిక తెప్పించుకున్నాక తదుపరి చర్యలు చేపడతామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వకుళాభరణం కృష్ణమోహన్ నేతృత్వంలోని బీసీ కమిషన్ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సిఉంది. అయితే ఈ ప్రక్రియ పూర్తవడానికి కొంత సమయం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు.