Atal Bihari Vajpayee Death Anniversary : రాజకీయాల యుగ పురుషుడు అని పిలుచుకునే భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఐదో వర్ధంతి నేడు. ఈసందర్భంగా ఇవాళ యావత్ దేశం ఆయనను స్మరించుకుంటున్నది. విలక్షణమైన వ్యక్తిత్వం వాజ్‌పేయి సొంతం. పార్టీలకు అతీతంగా అందరూ అభిమానించే ఇమేజ్ వాజ్‌పేయి సొంతం. దేశానికి 3 సార్లు ప్రధానమంత్రిగా సేవలందించి.. నిస్వార్థ రాజకీయ నాయకుడిగా ఆయన అందరి మన్ననలు పొందారు. కోట్లాది భారతీయుల మనసులు గెలిచిన జన నేత అటల్ బిహారీ వాజ్ పేయి మన నుంచి దూరమై నేటికి సరిగ్గా ఐదేళ్లు !!
ఆయన ప్రసంగ నైపుణ్యం అద్భుతం..
భారత 10వ ప్రధాన మంత్రిగా, బీజేపీ తొలి జాతీయ అధ్యక్షుడిగా కీర్తి గడించిన మహానేత అటల్ బిహారీ వాజ్‌పేయి (Atal Bihari Vajpayee) 1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో జన్మించారు. అటల్ బిహారీ వాజ్ పేయి జీవితాంతం బ్రహ్మచారిగానే ఉన్నారు. అయితే ఆయన నమితా భట్టాచార్య ను దత్తత తీసుకున్నారు. 1957లో బలరాంపూర్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా లోక్ సభకు ఎన్నికయ్యారు. తన రాజకీయ జీవితంలో 10 సార్లు లోక్ సభకు, 2 సార్లు రాజ్యసభకు అటల్ జీ ఎన్నికయ్యారు. ఆయన ఏ పదవిని చేపట్టినా దాన్ని హోదాగా కాకుండా బాధ్యతగా భావించేవారు. అటల్ బిహారీ వాజ్ పేయి అద్భుతమైన వక్తృత్వం, ఉచ్చారణ ద్వారా పార్లమెంటులో తనదైన ముద్ర వేశారు. ఆయన ప్రసంగ నైపుణ్యం అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూతో సహా చాలా మంది మనస్సులు గెలుచుకుంది. వాజ్‌పేయి స్వయంగా పద్యాలు రాసేవారు. 2005లో క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్న ఆయన.. తదుపరి సాధారణ ఎన్నికల్లో పోటీచేయబోనని ప్రకటించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. 2018 ఆగష్టు 16న అటల్ జీ పరమపదించారు.
Also read : Chandrayaan 3-177 KM : చంద్రుడికి 177 కి.మీ. దూరంలో చంద్రయాన్-3.. ఇవాళ ఏం జరిగిందంటే ?
విదేశాంగ మంత్రిగా అటల్ జీ పయనం మొదలైంది..
మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా ప్రభుత్వంలో విదేశాంగ శాఖ మంత్రిగా అటల్ జీ(Atal Bihari Vajpayee Death Anniversary ) పనిచేశారు. జనతా ప్రభుత్వం కూలిపోయినప్పడు, భారతీయ జనసంఘ్ లోని ఇతర సభ్యులతో కలిసి భారతీయ జనతా పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత 15 ఏళ్ల పాటు దేశమంతా పర్యటించి పార్టీ విస్తరణలో వాజ్ పేయి కీలక భూమిక పోషించారు. 1996లో 13 రోజులు, 1998-99లో 13 నెలలు, 1999 నుంచి 2004 వరకు ఐదేళ్ల పాటు(పూర్తికాలం) ప్రధానమంత్రిగా సేవలందించారు.
భారత రత్న వాజ్ పేయి (Atal Bihari Vajpayee)..
అటల్ బిహారీ వాజ్ పేయి పేరు వినగానే గుర్తొచ్చేది 1998 పోఖ్రాన్ అణు పరీక్ష ! ప్రపంచానికి తెలియకుండా ఐదు అణుపరీక్షలను నిర్వహించి అణ్వాయుధ దేశంగా భారత్ అవతరించింది. మూడు నెలల పాటు జరిగిన కార్గిల్ యుద్ధం అటల్ జీ ప్రధానిగా ఉన్నప్పుడే జరిగింది. కార్గిల్ విజయం వాజ్ పేయి రాజకీయ ప్రతిష్టను మరింత పెంచింది. 2015వ సంవత్సరంలో కేంద్రప్రభుత్వం భారత రత్నతో వాజ్ పేయిని గౌరవించింది.
Also read : Ramakrishna Paramahansa Death Anniversary : రామకృష్ణ జీవిత చరిత్ర – బోధనలు