Engineers Day 2024 : ఇవాళ (సెప్టెంబరు 15) జాతీయ ఇంజనీర్ల దినోత్సవం. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని ఇంజినీర్ల దినోత్సవంగా జరుపుకుంటారు. ఆయన 1861 సెప్టెంబరు 15న కర్ణాటకలోని ముద్దనేహళ్లి అనే చిన్న గ్రామంలో జన్మించారు. మైసూర్‌లోని ప్రసిద్ధ కృష్ణ రాజ సాగర డ్యామ్ సహా అనేక గుర్తింపు పొందిన బ్యారేజీల నిర్మాణంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య భాగస్వామిగా ఉన్నారు. డెక్కన్ పీఠభూమికి నీటిపారుదల వ్యవస్థను అభివృద్ధి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. నిజాం నవాబుల కాలంలో 1909 సంవత్సరంలో హైదరాబాద్‌కు వరద నియంత్రణ వ్యవస్థను రూపొందించడంలో విశ్వేశ్వరయ్య పాత్ర ఎనలేనిది. నేటి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, మూసీ నది పరివాహక ప్రాంతాల్లో సుందరీకరణ పనులు ఆయన ఆలోచన నుంచి వచ్చినవే. విశ్వేశ్వరయ్య ఆనాడు చేసిన సూచనల వల్లే హైదరాబాద్ నగరం కొన్ని దశాబ్దాల పాటు వరద ముప్పు నుంచి తప్పించుకోగలిగింది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య మన దేశానికి అందించిన విశిష్ట ఇంజినీరింగ్ సేవలకు గుర్తుగా ఏటా సెప్టెంబరు 15న(జయంతి రోజు) నేషనల్ ఇంజినీర్స్ డేగా(Engineers Day 2024) సెలబ్రేట్ చేసుకుంటాం.
Also Read :Kejriwal Resignation : రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా : సీఎం అరవింద్ కేజ్రీవాల్
- ‘‘ఇంకొద్ది క్షణాల్లో ఈ వంతెన కూలిపోతుంది.. రైలు ఆపండి.. అంటూ కేకలు వేసి వందల ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన మేధావి మోక్షగుండం విశ్వేశ్వరయ్య.. మేమే మాటలతో కాలయాపన చేశాం.. మీరు నిరంతర క్రియాశూరులైన నవభారత నిర్మాణానికి కృషి చేసిన మహానీయులు’’ అని 1961 సెప్టెంబర్ 15న జరిగిన విశ్వేశ్వరయ్య శతజయంతి వేడుకల్లో అప్పటి ప్రధాని నెహ్రు కామెంట్స్ చేశారు.
- విశ్వేశ్వరయ్య సివిల్ ఇంజనీర్‌గానే కాకుండా మైసూర్ 19వ దివాన్‌గా కూడా పనిచేశారు. బాంబే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా సేవలు అందించారు.
- మోక్షగుండం విశ్వేశ్వరయ్య తన జీవితకాలంలో బ్రిటీష్ ఇండియన్ ఎంపైర్‌కు చెందిన నైట్ కమాండర్ అవార్డును, భారతరత్న అవార్డును పొందారు.
- విశ్వేశ్వరయ్య చాలా నిజాయితీపరులు. ఓసారి ఫారిన్ టూరుకు డబ్బులు అవసరమయ్యాయి. దీంతో ఆయన తన వద్ద ఉన్న ప్రభుత్వ రుణపత్రాలను మైసూరు బ్యాంక్‌లో తాకట్టుపెట్టారు.