Site icon HashtagU Telugu

Ganga Tiger : గంగానదిలో పెద్దపులులు.. ఏమిటివి ? వాటికి ఏమవుతోంది ?

Ganga Tiger Gangetic Dolphins Ganga River Dolphins

Ganga Tiger : గంగానదిలో పెద్దపులులు ఉన్నాయి.. తెలుసా ? నదిలో పులులు ఉండటం ఏమిటి.. అనుకుంటున్నారా ? ఆ పులుల గురించి తెలియాలంటే తప్పకుండా ఈ కథనం చదవాల్సిందే.

Also Read :Elon Musk : ‘‘నా బిడ్డకు తండ్రి మస్క్’’.. యాష్లీ సెయింట్‌ క్లెయిర్ ఎవరు ?

ఏమిటివి ?

గంగానది పరమ పవిత్రమైంది. పురాణాలు, ఇతిహాసాల్లోనూ గంగానది గురించి ప్రస్తావన ఉంది. గంగానది బేసిన్‌లో 79 శాతం మన దేశంలోనే ఉంది. భారత్‌లోని 11 ఉత్తరాది రాష్ట్రాల్లో గంగానది ప్రవహిస్తుంది. ఈ జాబితాలో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బిహార్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ఉన్నాయి.  గంగానదిలో ఉన్న అతిపెద్ద జలచరాలు ఏవో తెలుసా ? డాల్ఫిన్లు. వీటినే గంగానది పులులు అని పిలుస్తారు.

ఏం చేస్తాయి ?

అడవుల్లో పెద్దపులి(Ganga Tiger) ఎలాంటి పాత్రను పోషిస్తుందో.. అలాంటి పాత్రనే గంగానది ఆవరణ వ్యవస్థలో డాల్ఫిన్లు పోషిస్తాయి. అందుకే వాటిని గంగానది పులులుగా కీర్తిస్తారు. డాల్ఫిన్లు తమ ఆహార వేటలో భాగంగా గంగా నదిలోని వివిధ చేపలు, రొయ్యల జాతుల సంఖ్యను క్రమబద్ధీకరిస్తాయి. కాలక్రమంలో  గంగా నదిలోని డాల్ఫిన్ల సంఖ్య 65శాతం దాకా తగ్గిపోయింది. ప్రస్తుతం నదిలో దాదాపు 5వేల దాకా డాల్ఫిన్లు ఉండొచ్చని అంచనా. వీటి సంఖ్య తగ్గిపోతుండటంతో, పరిరక్షణపై కేంద్ర సర్కారు ప్రత్యేక ఫోకస్ పెట్టింది. గంగా డాల్ఫిన్‌ను వన్యప్రాణి (సంరక్షణ) చట్టం-1972 షెడ్యూల్‌-1లో చేర్చారు. వీటిని పులులతో సమానంగా రక్షించాలని నిర్ణయించారు.

Also Read :Trump Vs Transgenders : ట్రాన్స్‌జెండర్లకు ట్రంప్ మరో షాక్.. అమెరికా ఆర్మీ కీలక ప్రకటన

సంతానోత్పత్తి సామర్థ్యం డౌన్ 

వివిధ రాష్ట్రాల పరిధిలో గంగానదిలో నీటి ప్రవాహాలు తగ్గిపోయాయి. దీంతో డాల్ఫిన్ల సహజ ఆవాస ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. అవి తినే చేపలను మత్స్యకారులు  గత కొన్నేళ్లుగా అతిగా వేటాడుతున్నారు. చేపలను వేటాడే టెక్నాలజీ బాగా అడ్వాన్స్‌డ్ అయింది. డ్యామ్‌లు, జలవిద్యుత్‌ కేంద్రాలు, పరిశ్రమలు, పొలాల నుంచి గంగా నదిలోకి రసాయనాలు, క్రిమిసంహారకాలు వచ్చి చేరుతున్నాయి. దీంతో గంగా నదిలోని నీరు కలుషితం అవుతోంది. మర పడవలు, నౌకలతో తలెత్తే ధ్వని కాలుష్యం డాల్ఫిన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ అంశాల ప్రభావంతో డాల్ఫిన్ల సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతోంది. సాధారణంగానైతే అవి రెండు, మూడేళ్లకు ఒకసారి ఒక పిల్లకు జన్మనిస్తాయి. ఇప్పుడు డాల్ఫిన్లు ఒక పిల్లకు జన్మినిచ్చే సగటు సంవత్సరాల సంఖ్య పెరుగుతోంది.