Mysore Sandal Soap: మైసూర్ శాండిల్ సబ్బు మనకు అందరికీ తెలుసు. మనలో చాలామంది ఈ సబ్బును వాడుతుంటారు. అయితే ఈ సబ్బు హిస్టరీ చాలా పెద్దది. ఎంత పెద్దది అంటే వరల్డ్ వార్ -1 తోనూ దీనికి లింక్ ఉంది. ఆ సంగతేంటో తెలియాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే.
మైసూరు సంస్థానం .. గంధపు చెక్కలు
మొదటి ప్రపంచ యుద్ధం 1914 జులై 28 నుంచి 1918 నవంబరు 11 వరకు జరిగింది. ఈ యుద్ధం జరిగే సమయానికి మన భారతదేశానికి స్వాతంత్య్రం రాలేదు. అప్పటికి మనం బ్రిటీష్ పాలనలోనే ఉన్నాం. ఆ సమయానికి కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ ప్రాంతాన్ని వొడియార్ రాజవంశం పాలిస్తోంది. మొదటి ప్రపంచ యుద్ధం మొదలుకావడానికి ముందు వరకు మైసూరు సంస్థానం నుంచి విదేశాలకు పెద్దఎత్తున గంధపు చెక్కలు ఎగుమతి అయ్యేవి. యుద్ధం మొదలయ్యాక విదేశాల నుంచి మైసూరుకు ఆర్డర్లు ఆగిపోయాయి.
మోక్షగుండం విశ్వేశ్వరయ్య అద్భుత ఐడియా
1914లో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. దాని ఎఫెక్ట్ వల్ల 1916 నాటికి గంధపు చెక్కల కోసం విదేశీ ఆర్డర్లు ఆగిపోయాయి. దీంతో ఏం చేయాలి ? అనే దానిపై నాటి మైసూరు మహారాజు కృష్ణ రాజ వొడియార్- 4 మేధోమధనం చేశారు. ఈ సమయంలో ఆయనకు దివాన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య కీలక సలహా ఇచ్చారు. ఆ సలహా మేరకు 1916 మేలో ప్రభుత్వ శాండిల్వుడ్ ఆయిల్ ఫ్యాక్టరీని మహారాజు కృష్ణ రాజ వొడియార్- 4 ఏర్పాటు చేశారు. ఈ ఫ్యాక్టరీలో శాండిల్వుడ్ నుంచి ఆయిల్ని తీసేవారు. ఈప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతలను దివాన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకే మహారాజు అప్పగించారు.
Also Read :Monsoon Herald : ఈ ఆలయం రుతుపవనాల రాకను ముందే గుర్తించగలదు
కెమిస్ట్ గారాలపూరి శాస్త్రిని విశ్వేశ్వరయ్య కలిశాక..
గంధపు చెక్కలతో ఇంకా ఏమేం తయారు చేయొచ్చు ? అనే దానిపై మైసూరు మహారాజు(Mysore Sandal Soap) కసరత్తు చేశారు. ఈ తరుణంలో సబ్బులను తయారు చేయొచ్చని దివాన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచించారు. తదుపరిగా విశ్వేశ్వరయ్య సమక్షంలో బెంగళూరులో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సులో సబ్బుల తయారీపై అనేక పరిశోధనలు జరిగాయి. బాంబే సహా అనేక ప్రాంతాల నుంచి నిపుణులను పిలిపించారు. ఈతరుణంలో ప్రముఖ కెమిస్ట్ గారాలపూరి శాస్త్రి గురించి మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు తెలిసింది. దీంతో విశ్వేశ్వరయ్య వెళ్లి గారాలపూరి శాస్త్రిని కలిశారు. ఆయన సబ్బుల తయారీ ప్రక్రియ గురించి వివరించారు. తదుపరిగా గారాలపూరి శాస్త్రి ఇంగ్లాండ్ సహా అనేక ప్రాంతాలను సందర్శించి, మరింత జ్ఞానాన్ని పెంచుకుని మైసూరుకు తిరిగొచ్చారు. ఆ తర్వాత మైసూర్ శాండిల్ సబ్బు తయారీ దిశగా పనులు మొదలయ్యాయి.
1918లో మొదటి బ్యాచ్ రెడీ
శాండిల్వుడ్ ఆయిల్ ఫ్యాక్టరీతో పాటు సబ్బు తయారీకి మరోక ఫ్యాక్టరీ ఏర్పడింది. ఎట్టకేలకు 1918లో మైసూర్ శాండిల్ సబ్బుకు సంబంధించిన మొదటి బ్యాచ్ రెడీ అయ్యింది.తొలిసారిగా తయారు చేసిన మైసూర్ శాండిల్ సబ్బులను మైసూరు మహారాజు కృష్ణ రాజ వొడియార్- 4క బహుమతిగా ఇచ్చారు. అవి ఆయనకు బాగా నచ్చాయి. మైసూర్ శాండిల్ లోగో మీద ‘శరబ’ అని ఉంటుంది. సగం సింహం, సగం జింక, సగం పక్షి ఆకారంలో ఉండే ఈ శరబకు చాలా శక్తి ఉంటుందని అంటారు. 1980లో మైసూర్ శాండిల్ సబ్బు తయారీ ఫ్యాక్టరీ, ఆయిల్ ఫ్యాక్టరీ విలీనం అయ్యాయి. దీంతో కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (కేఎస్డీఎల్) అనే కంపెనీ ఏర్పడింది. ఇటీవలి కాలంలో శాండిల్వుడ్ లభ్యత గణనీయంగా పడిపోతోంది. అందుకే ‘గ్రో మోర్ శాండిల్వుడ్’ అనే ప్రచారం చేస్తోంది కేఎస్డీఎల్.