తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి పోర్టల్ (Telangana Bhu Bharathi Portal 2025) ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సోమవారం ప్రారంభించారు. మొదటిగా ఇది పైలట్ ప్రాజెక్ట్‌గా నాలుగు మండలాల్లో అమలులోకి రానుంది. జూన్ 2 నాటికి రాష్ట్రవ్యాప్తంగా భూ భారతి అందుబాటులోకి తేనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా భూముల పక్కా రికార్డులు, హద్దులు, భూధార్ కార్డులు ఇవ్వడం ద్వారా రైతుల భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపనున్నారు.
ధరణి పోర్టల్‌తో పోలిస్తే భూ భారతి పోర్టల్‌లో అనేక మార్పులు తీసుకొచ్చారు. ముఖ్యంగా వివాదాస్పద భూముల పరిష్కారం, అనుభవదారు కాలమ్‌కు అవకాశం, అప్పీల్స్ వ్యవస్థ, తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్లకు అధికారం, అసైన్డ్ భూములకు పాస్ పుస్తకాలు వంటి అనేక మార్పులు రైతులకు ప్రయోజనం కలిగించేలా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా, రిజిస్ట్రేషన్ తర్వాత భూముల సర్వే చేసి మ్యాప్‌తో పాటు పాస్ పుస్తకం ఇవ్వడం భూమి-రిజిస్ట్రేషన్ లింక్‌ను బలపరుస్తుంది.
Shikhar Dhawan: గర్ల్ ఫ్రెండ్‌తో టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్.. ఫొటోలు వైరల్!
ఇక భూ భారతి చట్టం ప్రకారం రైతులకు జిల్లా స్థాయిలో రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ, భూమి ట్రైబ్యునల్స్ ఏర్పాటు, ఉచిత న్యాయ సహాయం, గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్దరణ, గ్రామ ప్రజాపాలన అధికారుల నియామకం వంటి చర్యలు తీసుకోవడం ద్వారా గ్రామ స్థాయిలోనే భూ సమస్యలకు పరిష్కారం చూపనున్నారు. మోసపూరితంగా రికార్డులు మార్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకునే నిబంధనలు రైతుల హక్కులను రక్షించేలా రూపొందించబడ్డాయి.
ధరణి కంటే భూ భారతి మెరుగుదేనా? అన్నదానిపై ఇంకా చర్చ కొనసాగుతున్నా, భూ భారతి ద్వారా భూ రికార్డుల సరి దిద్దులు, మ్యుటేషన్, వారసత్వ నమోదు, పాస్ పుస్తకాల జారీ వంటి అంశాల్లో పారదర్శకత పెరుగుతుందనేది ప్రభుత్వం వాదన. సరిగ్గా అమలు చేస్తే ఇది రైతులకు భారీగా లాభం చేకూర్చే పథకంగా నిలవొచ్చు. అయితే, కార్యాచరణలో సాఫీగా నడిపితేనే రైతులకు వాస్తవ లాభం కలగనుంది. రైతులకు ఈ కొత్త వ్యవస్థ నష్టంగా కాకుండా, నిజమైన ప్రయోజనం కలిగించాలంటే పటిష్టమైన అమలు మార్గదర్శకాలు, సమర్థవంతమైన మానిటరింగ్ అవసరం.
Summer Diseases: ఈ సమ్మర్‌లో పిల్లలకు వచ్చే మూడు సమస్యలివే.. నివారణ చర్యలివే!
భూ భారతి చట్టం రూల్స్ చూస్తే..
1. ధరణి స్థానంలో కొత్తగా భూమి హక్కుల రికార్డు (ఆర్ ఓ ఆర్) రూపొందించవచ్చు.
2. ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి ధరణిలో తప్పులను సవరించవచ్చు.
3. ఇంటి స్థలాలకు, ఆబాది, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు రూపొందించవచ్చు.
4. ధరణిలో తప్పుల సవరణ కోసం దరఖాస్తులు స్వీకరించి రికార్డు సరి చేయవచ్చు.
5. భూమి పై హక్కులు ఉండి రికార్డులో లేని వారు దరఖాస్తు చేసుకునే అవకాశం. విచారణ చేసి పాస్ పుస్తకాలు ఇవ్వవచ్చు.
6. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేయడానికి ముందు మ్యాప్ తప్పనిసరి. లైసెన్సు డ్ సర్వేయర్ల ద్వారా భూముల సర్వే. గెట్టు వివాదాలు, డబుల్ రిజిస్ట్రేషన్లకు చెల్లు చీటి.
7. పెండింగ్ సాదా బైనామా దరఖాస్తు పరిష్కారం.
8. వారసత్వంగా వచ్చిన భూములకు మ్యుటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ. డీమ్డ్ మ్యుటేషన్ కు అవకాశం.
9. భూమి హక్కులు ఏవిధంగా సంక్రమించిన మ్యుటేషన్ చేసి రికార్డులకు ఎక్కించే అవకాశం.
10. పాస్ పుస్తకాలలో భూమి పటం.
11. రికార్డులను పరిశీలించి తాత్కాలిక భూ ధార్ కార్డుల జారీ. దీనితో ధరణి రికార్డుల ప్రక్షాళన.
12. భూముల సర్వే చేసి కొత్త హక్కుల రికార్డు తయారీ, శాశ్వత భూ ధార్ కార్డుల జారీ.
13. ఆర్ ఓ ఆర్ సమస్యల పరిష్కారానికి రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ.
14. జిల్లా స్థాయిలో భూమి ట్రిబ్యునల్స్ ఏర్పాటు.
15. రైతులకు ఉచిత న్యాయ సహాయం. ఇందుకోసం జిల్లాల్లో న్యాయ సహాయ కేంద్రాల ఏర్పాటు.
16. ధరణి వెబ్ పోర్టల్ స్థానంలో భూ భారతి పేరుతో కొత్త పోర్టల్ ఏర్పాటు.
17. రెవిన్యూ సదస్సులు నిర్వహించి గ్రామ స్థాయిలో భూ సమస్యల పరిష్కారానికి అవకాశం.
18. పహాణి, ఇతర గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ.
19. ప్రభుత్వ, భూ దాన్, అటవీ, దేవాదాయ, వక్ఫ్ భూములకు తప్పుగా పట్టాలు జారీ చేస్తే ఎవరైనా కంప్లైంటు ఇచ్చే అవకాశం. రికార్డులను సవరించడానికి రివిజన్ అధికారాలు.
20. మోసపూరితంగా రికార్డులు మారిస్తే అధికారుల పై చర్యలకు అవకాశం.