Ajit Pawar Plane Crash: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బుధవారం విమాన ప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం బారామతి విమానాశ్రయంలో ల్యాండింగ్ కావడానికి ముందే ప్రమాదానికి గురైంది. గతంలో కూడా విమాన,హెలికాప్టర్ ప్రమాదాల్లో దేశం అనేక మంది దిగ్గజ నాయకులను కోల్పోయింది. దురదృష్టవశాత్తూ సాంకేతిక లోపాలు, వాతావరణం లేదా ఇతర కారణాల వల్ల ఇటువంటి ప్రమాదాలు జరిగాయి. ఇప్పటి వరకు ఇలాంటి ప్రమాదాల్లో మరణించిన నాయకుల వివరాలు తెలుసుకుందాం.
విజయ్ రూపానీ – 12 జూన్ 2025
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ 12 జూన్ 2025న అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించారు. ఆయన తన కుమార్తెను కలవడానికి లండన్ వెళ్తున్నారు. రన్‌వేకు కొద్ది దూరంలో విమానం కూలిపోయి ఒక కాలేజీ హాస్టల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఒక్కరు మాత్రమే బతికారు.
వై.ఎస్. రాజశేఖర రెడ్డి – 2 సెప్టెంబర్ 2009
ఆంధ్రప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నల్లమల అడవుల్లో ప్రమాదానికి గురైంది. వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు భావించారు. ఈ దుర్ఘటనలో ఆయనతో సహా విమానంలో ఉన్నవారంతా మరణించారు.
Also Read: పసిడి ప్రియులకు షాక్.. ఒక్కరోజులో రూ.8 వేలకు పైగా పెరిగిన బంగారం..
డి.ఓ. ఖండూ – 30 ఏప్రిల్ 2011
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండూ కూడా హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. తవాంగ్ నుండి ఇటానగర్ వెళ్తుండగా పవన్ హన్స్ హెలికాప్టర్ గ్రౌండ్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయి కూలిపోయింది. ఐదు రోజుల తర్వాత తవాంగ్ అడవుల్లో ఆయన మృతదేహం, విమాన శకలాలు లభించాయి.
జి.ఎం.సి. బాలయోగి – 3 మార్చి 2002
లోక్‌సభ స్పీకర్, తెలుగుదేశం పార్టీ నాయకుడు జి.ఎం.సి. బాలయోగి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. హెలికాప్టర్ ఎత్తైన చెట్లను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఓం ప్రకాష్ జిందాల్- సురేంద్ర సింగ్ – 31 మార్చి 2005
హర్యానా విద్యుత్ శాఖ మంత్రి, జిందాల్ గ్రూప్ ఛైర్మన్ ఓ.పి. జిందాల్, మాజీ కేంద్ర మంత్రి సురేంద్ర సింగ్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఢిల్లీ నుండి చండీగఢ్ వెళ్తుండగా ఉత్తరప్రదేశ్ లోని సహరాన్‌పూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.
సంజయ్ గాంధీ – 23 జూన్ 1980
కాంగ్రెస్ నాయకుడు, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించారు. స్వయంగా విమానం నడపడం ఇష్టపడే ఆయన, గ్లైడర్ ఎగురవేస్తున్న సమయంలో నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది.
మాధవరావు సింధియా – 30 సెప్టెంబర్ 2001
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ పౌర విమానయాన శాఖ మంత్రి మాధవరావు సింధియా కాన్పూర్ వెళ్తుండగా ప్రైవేట్ విమానం ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్నవారంతా మరణించారు.
సురేంద్ర నాథ్ – 9 జూలై 1994
పంజాబ్ గవర్నర్‌గా పనిచేస్తున్న సురేంద్ర నాథ్ హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన ప్రభుత్వ విమాన ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు.
