Starcrete on Mars: త్వరలో అంగారకుడిపై ఇల్లు? “స్టార్‌ క్రీట్” మెటీరియల్ రెడీ.. విశేషాలివీ..

అంగారకుడిపై ఇల్లు నిర్మించడానికి ప్లాన్ మాత్రమే కాదు.. మెటీరియల్ కూడా రెడీ అయింది. భూమిపై ఇళ్లు కట్టడానికి కాంక్రీటు అవసరం.

అంగారకుడిపై (Mars) ఇల్లు నిర్మించడానికి ప్లాన్ మాత్రమే కాదు.. మెటీరియల్ కూడా రెడీ అయింది. భూమిపై ఇళ్లు కట్టడానికి కాంక్రీటు అవసరం. కానీ అంగారకుడిపై ఇల్లు కట్టేందుకు “స్టార్‌ క్రీట్” (Starcrete) అనే పేరుతో మెటీరియల్ ను బ్రిటన్ లోని యూనివర్శిటీ ఆఫ్ మాంచెస్టర్ శాస్త్రవేత్తల బృందం అభివృద్ధి చేసింది. ఇది గ్రహాంతర వాతా వరణంలో నిర్మాణ పనులకు అనుకూలంగా ఉంటుంది. ఈ మెటీరియల్ ను చంద్రుడిపై నుంచి తెచ్చిన రాళ్ళ నుంచి సేకరించిన దుమ్ము, ధూళితో పాటు బంగాళాదుంప పిండి, ఉప్పుతో తయారు చేశారు.

అంగారక గ్రహంపై గృహాలను నిర్మించడానికి  దీన్ని ఉపయోగించవచ్చు.ఈ పదార్థం సాధారణ కాంక్రీటు కంటే రెండు రెట్లు బలంగా ఉంటుంది. ఈమేరకు వివరాలతో కూడిన స్టడీ రిపోర్ట్ “ఓపెన్ ఇంజినీరింగ్” జర్నల్‌లో పబ్లిష్ అయింది. దీని ప్రకారం..”స్టార్‌ క్రీట్” (StarCrete) అనేది 72 మెగాపాస్కల్స్ (MPa) యొక్క సంపీడన బలాన్ని కలిగి ఉంటుంది. సాధారణ కాంక్రీటు యొక్క సంపీడన బలం 32 మెగాపాస్కల్స్ మాత్రమే.

ఈలెక్కన “స్టార్‌ క్రీట్” (Starcrete) యొక్క సంపీడన బలం సాధారణ కాంక్రీటు సంపీడన బలం కంటే డబుల్.కాంక్రీటు యొక్క సంపీడన బలాన్ని మెగాపాస్కల్స్ (MPa) లో కొలుస్తారు. పగుళ్లు ఏర్పడే ముందు లేదా పూర్తిగా విఫలమయ్యే ముందు కాంక్రీటు ఎంత ఒత్తిడిని తట్టుకోగలదు అనేది తెలుసుకోవాలంటే దాని సంపీడన బలాన్ని లెక్క వేయాలి.

గతంలో వ్యోమగాముల రక్తం, మూత్రం నుంచి సేకరించిన బైండింగ్ ఏజెంట్‌ ను “స్టార్‌ క్రీట్” తయారీకి వాడాలని తొలుత భావించారు. అయితే ఇందుకోసం వ్యోమగాముల రక్తం, మూత్రంపై ఆధారపడాల్సి ఉంటుంది. ఫలితంగా ఇటువంటి మెటీరియల్ ని పెద్ద మొత్తంలో తయారు చేయడం సాధ్యపడదు. అందుకే దీని స్థానంలో బంగాళాదుంప పిండిని “స్టార్‌ క్రీట్” తయారీకి మెటీరియల్ గా వాడారు.

స్టార్‌ క్రీట్‌తో (Starcrete) 3 పడక గదుల ఇంటిని ఎలా నిర్మించాలి?

ఒక సాక్ అంటే 25 కిలోలు. డీహైడ్రేటెడ్ చేసిన దాదాపు అర టన్ను బంగాళా దుంపలు స్టార్‌ క్రీట్‌ను ఉత్పత్తి చేయడానికి తగినంత పిండిని కలిగి ఉంటాయి. ఇది 213 ఇటుకలకు సమానమైన పదార్థం.  మూడు పడక గదుల ఇల్లు నిర్మించడానికి దాదాపు 7,500 ఇటుకలు అవసరం.

భూమిపై స్టార్‌ క్రీట్ (Starcrete) ఉపయోగిస్తే..?

సిమెంట్‌తో కలిపిన సాధారణ కాంక్రీటును తయారుచేయడానికి చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలు అవసరమవుతాయి. ప్రపంచ వ్యాప్తంగా వెలువడుతున్న CO2 ఉద్గారాలలో 8% వరకు కాంక్రీట్ తయారీ క్రమంలోనే రిలీజ్ అవుతున్నాయి. స్టార్‌ క్రీట్‌ను సాధారణ ఓవెన్ లేదా మైక్రోవేవ్‌లో సాధారణ ‘హోమ్ బేకింగ్’ ఉష్ణోగ్రతల వద్ద తయారు చేయవచ్చు. ఫలితంగా ఉత్పత్తి శక్తి ఖర్చులు తగ్గుతాయి. ఫలితంగా స్టార్‌ క్రీట్ ను భూమిపై ఉపయోగించి నట్లయితే.. సాంప్రదాయ కాంక్రీటుకు పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది.

Also Read:  Guinness Record: 9 ఏళ్ల బాలుడి గిన్నిస్ రికార్డు.. 4 సెకన్లలోనే రూబిక్స్ క్యూబ్‌ పరిష్కారం