Site icon HashtagU Telugu

Dalai Lama: ద‌లైలామా మెచ్చిన పుస్త‌కం.. విశేషాలీవే!

Dalai Lama

Dalai Lama

Dalai Lama: డాక్టర్ అరవింద్ యాదవ్ రచించిన దివ్య మూర్తి పద్నాలుగో దలైలామా (Dalai Lama) అనే సమగ్ర జీవిత చరిత్ర, టెన్జిన్ గ్యాత్సో జీవన యానాన్ని లోతైన పరిశోధనతో, అరుదైన వాస్తవాలతో, విశ్వసనీయంగా ఆవిష్కరిస్తుంది. బౌద్ధ ఆధ్యాత్మికత, మానవ విలువలు, అహింసా సిద్ధాంతాలకు ప్రతీకగా నిలిచిన దలైలామా జీవితం, సవాళ్లు, విజయాలు, ప్రజల పట్ల ఆయన అపార ప్రేమ కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చాయి. ఈ గ్రంథం, ఆయన బాల్యం నుండి ప్రవాస జీవితం వరకు, చైనా ఆక్రమణ, టిబెట్ ప్రజల ఆకాంక్షలు, నాయకత్వ లక్షణాలు, ఆధ్యాత్మిక మార్గదర్శనం, మానవ సమాజం పట్ల నిబద్ధతను వివరిస్తుంది.

2025 జులై 9న దలైలామా 90వ జన్మదినోత్సవ సందర్భంగా ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానున్న ఈ పుస్తకం ఇప్పటివరకు వెలువడిన ఇతర రచనల కంటే భిన్నంగా, లోతుగా ఉంది. దలైలామా స్వయంగా ఈ రచనను ప్రశంసిస్తూ.. డాక్టర్ యాదవ్ లోతైన పరిశోధన, బౌద్ధ తాత్వికతపై అవగాహన ఈ గ్రంథాన్ని విలువైన వనరుగా మార్చాయని, తన జీవితం, టిబెట్ పోరాటం, మానవ విలువలు, భారతీయ జ్ఞానం పట్ల శ్రద్ధను అద్భుతంగా ప్రతిబింబించాయని అన్నారు. ప్రముఖ తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు డాక్టర్ కరణ్ సింగ్, ఈ పుస్తకం దలైలామా జీవితంలో తెలియని అంశాలను సమగ్రంగా వెల్లడిస్తూ, ఆయన వ్యక్తిత్వాన్ని, అంతరంగాన్ని పరిచయం చేస్తుందని, ఈ కృషిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని పేర్కొన్నారు.

Also Read: Nandamuri Taraka Ramarao : తాత పేరు నిలబెట్టాలి అంటూ మ‌న‌వ‌డికి భువ‌నేశ్వ‌రి ఆశీర్వాదం

డాక్టర్ యాదవ్, హైదరాబాదులో జన్మించి, ఉస్మానియా యూనివర్సిటీలో ఇంగ్లీష్, హిందీలో ఎంఏ పూర్తి చేసి, సైన్స్, సైకాలజీ, లా వంటి విభాగాల్లో విస్తృతంగా అధ్యయనం చేశారు. దక్షిణ భారత రాజకీయాలు, సంస్కృతిపై లోతైన అవగాహన, ప్రజల జీవన శైలిని అధ్యయనం చేసిన అనుభవం ఆయన రచనలకు సమగ్రతను జోడించాయి. ఆయన గతంలో ఎన్.ఆర్. రావు, డాక్టర్ పద్మావతి, నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్ వంటి ప్రముఖుల జీవిత చరిత్రలను రచించారు.

ఈ గ్రంథం ఆధ్యాత్మికత, సాహిత్యం, మానవ హక్కులపై ఆసక్తి ఉన్నవారికి అమూల్యమైనది. టిబెట్ ప్రజల పోరాటం, బౌద్ధ తత్వం, దలైలామా దృక్పథాన్ని వివరిస్తూ, ఇది భవిష్యత్ తరాలకు మానవతా దిక్సూచిగా నిలుస్తుంది.

ముఖ్యాంశాలు