100 Years For Electric Train : మనదేశంలో రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేసింది బ్రిటీష్ వాళ్లే. భారత దేశంలోని తమ వ్యాపార అవసరాలను తీర్చుకునే ప్రధాన లక్ష్యంతో రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేశారు. రైళ్లను ప్రధానంగా సరుకుల ఎగుమతి, దిగుమతుల కోసం బ్రిటీషర్లు వాడుకునే వారు. కాల క్రమంలో ప్రయాణికుల కోసం కూడా రైల్వే సర్వీసులను బ్రిటీష్ వాళ్లు ప్రారంభించారు. ఏదిఏమైనప్పటికీ భారతదేశ రైల్వే చరిత్రలో ఇవాళ కీలకమైన రోజు. ఎందుకంటే మన దేశంలో తొలి ఎలక్ట్రిక్ రైలు పరుగులు తీసి నేటికి సరిగ్గా వందేళ్లు. 1925 సంవత్సరం ఫిబ్రవరి 3న ముంబై నగరంలోని విక్టోరియా టెర్మినస్ (ప్రస్తుత ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్) రైల్వేస్టేషన్ నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్ రైలు ప్రయాణం మొదలుపెట్టింది. దానిలో కేవలం మూడు కోచ్‌లు ఏర్పాటు చేశారు. తొలిసారి ఎలాంటి శబ్దం లేకుండా, పొగను రిలీజ్ చేయకుండా, కామ్‌గా రైలు నడవడాన్ని చూసి అందరూ హ్యాపీగా ఫీలయ్యారు.
Also Read :ISROs 100th Mission : ఇస్రో 100వ ప్రయోగం ఫెయిల్.. కక్ష్యలోకి చేరని ‘ఎన్‌వీఎస్-02’ శాటిలైట్
మన తొలి ఎలక్ట్రిక్ రైలు విశేషాలు..
- తొలి ఎలక్ట్రిక్ రైలు(100 Years For Electric Train)ను ముంబై–కుర్లా మార్గంలో నడిపారు.
- ఈ రైలు ఎలక్ట్రిక్ ఇంజిన్‌ను స్విట్జర్లాండ్‌కు చెందిన స్విస్ లోకోమోటివ్ అండ్ మెషీన్‌వర్క్స్ సంస్థ తయారు చేసింది. దీనిపై బ్రిటీష్ వాళ్లు బాగానే పెట్టుబడి పెట్టారు.
- ఈ రైలులో మూడు కోచ్‌లు ఉన్నాయి. వీటిని ఇంగ్లండ్‌కు చెందిన కామెల్–లెయిర్డ్, జర్మనీకి చెందిన ఉర్డింగెన్ వ్యాగన్ ఫాబ్రిక్ సంస్థలు తయారు చేశాయి.
- రైలును నడిపేందుకు 1,500 వోల్టుల డీసీ విద్యుత్‌ను ఉపయోగించారు.
- మన దేశంలో 1930 వరకు బ్రిటీష్ వాళ్లు వరుసగా విద్యుత్ రైళ్ల సర్వీసులను ప్రారంభించారు.
- అయితే 1930 తర్వాత ఈ రైళ్ల సర్వీసులను ప్రారంభించడం బాగా తగ్గించేశారు. భారత స్వాతంత్య్రోద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటమే దీనికి కారణం.
- 1930 నుంచి 1947 మధ్య కాలంలో దేశంలో కేవలం 388 కిలోమీటర్ల రైల్వే మార్గాన్ని మాత్రమే బ్రిటీషర్లు విద్యుదీకరించారు.
- మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలి ఐదేళ్లు రైల్వే మార్గాల విద్యుదీకరణ పూర్తిగా నిలిచిపోయింది.
మన దేశం సొంతంగా..
- చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్‌లో 1961లో మన దేశం సొంతంగా ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఇంజిన్‌ను తయారుచేసింది. దీనికి ‘డబ్ల్యూసీఎం–5 లోకమాన్య’ అని పేరు పెట్టారు.
- 2015లో స్విస్ కంపెనీ ఆల్‌స్టామ్‌తో భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఆ కంపెనీతో కలిసి బిహార్‌లోని మాధేపురాలో ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌ల తయారీ యూనిట్ ప్రారంభించింది. అక్కడ 12వేల హార్స్‌పవర్ సామర్థ్యమున్న లోకోమోటివ్‌లను తయారు చేస్తున్నారు. 250 కంటే అధికంగా వ్యాగన్లు ఉండే సరుకు రవాణా రైళ్లకు ఈ లోకోమోటివ్‌లను వాడుతున్నారు.
- ప్రపంచంలో తొలిసారిగా పాత డీజిల్ రైలు ఇంజన్‌ను ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌గా మార్చిన ఘనత మన దేశ రైల్వేదే.
- మన దేశంలో ప్రస్తుతం వినియోగిస్తున్న విద్యుత్ లోకోమోటివ్‌లు 10,230, డీజిల్ ఇంజన్లు 4,560.