Virat Kohli : విరాట్ కు విశ్రాంతి.. దక్షిణాఫ్రికా తో టీ20 సిరీస్ కు డౌటే?

ఫామ్ లో లేక బాధపడుతున్న విరాట్ కోహ్లీకి కొంత విరామం ఇవ్వాలని భారత జట్టు ఎంపిక కమిటీ సభ్యులు భావిస్తున్నారు.

  • Written By:
  • Updated On - May 14, 2022 / 10:05 AM IST

ఫామ్ లో లేక బాధపడుతున్న విరాట్ కోహ్లీకి కొంత విరామం ఇవ్వాలని భారత జట్టు ఎంపిక కమిటీ సభ్యులు భావిస్తున్నారు. జూన్ 9 నుంచి 19 వరకు స్వదేశంలో దక్షిణాఫ్రికా తో జరిగే టీ20 టోర్నీకి విరాట్ ను జట్టులోకి తీసుకోవద్దని యోచిస్తున్నారు. దీనిపై ఛేతన్ శర్మ నేతృత్వంలోని జాతీయ సెలెక్షన్ కమిటీ సభ్యులు త్వరలోనే కోహ్లితో కీలక భేటీ జరుపనున్నారు. ఆ తర్వాత సెలెక్షన్ కమిటీ సభ్యులు.. టీమిండియా సారథి రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ లతో కూడా చర్చించనున్నారు.  ఆ తర్వాతే కోహ్లికి విశ్రాంతి విషయంలో ఓ స్పష్టత రానుంది. విరామం అనంతరం ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌కు కోహ్లి రెట్టింపు ఉత్సాహంతో తిరిగి వస్తాడని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఐపీఎల్ ముగిసేనాటికి.. దక్షిణాఫ్రికా తో టీ20 సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించే అవకాశముంది.

ఐపీఎల్‌ లో పేలవంగా కోహ్లీ..

ఐపీఎల్-15లో విరాట్ కోహ్లీ 12 మ్యాచులు ఆడి 19.64 సగటుతో 216 పరుగులే చేశాడు. ఈ సీజన్ లో మూడు గోల్డెన్ డకౌట్లు అయ్యాడు. ఈనేపథ్యంలో  మాజీ కోచ్‌ రవిశాస్త్రి,మైఖేల్ వాన్ తో పాటు ఇతర ఆటగాళ్లు కూడా కోహ్లీ ఫామ్ పై ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని నెలల పాటు అతడికి విశ్రాంతి ఇవ్వాలని సూచనలు చేశారు. ఆ సూచనలను కోహ్లి ఎలా తీసుకున్నాడో గానీ.. సెలెక్టర్లు మాత్రం  వారి సలహాలను  తూచా తప్పకుండా పాటించబోతున్నట్టు తెలుస్తున్నది. ఇదే విషయమై భారత జట్టు ఎంపిక  కమిటీకి చెందిన ఓ సభ్యుడు మాట్లాడుతూ.. ‘ఇలాంటి ఒక దశ ప్రతి ఆటగాడి కెరీర్ లోనూ ఉంటుంది. కోహ్లి ప్రస్తుతం అదే దశలో ఉన్నాడు. అయితే త్వరలోనే అతడు దీనిని అధిగమిస్తాడనే నమ్మకం మాకుంది. కానీ సెలెక్టర్లుగా మా దృష్టి జట్టు మీద ఉంటుంది. మా మొదటి ప్రాధాన్యం కూడా అదే. దక్షిణాఫ్రికా తో సిరీస్ కు ముందు కోహ్లితో మాట్లాడతాం. ఒకవేళ అతడేమైనా విశ్రాంతి కావాలనుకుంటున్నాడా..? లేక పోరాడతాడా..? అనేది అడిగి తెలుసుకుంటాం…’ అని తెలిపారు.

ఐపీఎల్ లో కోహ్లీ స్కోర్ కార్డు..

ఈ ఐపీఎల్ లో ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్ లలో వరుసగా 41 నాటౌట్, 12, 5, 48, 1, 12, 0, 0, 9, 58, 30, 0 (మొత్తం 216) స్కోర్లు కోహ్లీ చేశాడు. అయితే ఐపీఎల్ ప్రదర్శన అనేది జాతీయ జట్టుకు అన్నిసార్లు కొలమానం కానప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో కూడా కోహ్లి గొప్పగా రాణించింది లేదు. అతడు  సెంచరీ చేయక  100 (మూడు ఫార్మాట్లలో) ఇన్నింగ్స్ లు దాటాయి.

దక్షిణాఫ్రికా తో భారత్ టీ20 సిరీస్ షెడ్యూల్..

జూన్‌ 9 నుంచి 19 వరకు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఢిల్లీ, కటక్‌, విశాఖపట్నం, రాజ్‌కోట్‌, బెంగళూరు వేదికల్లో జరుగనుంది. అనంతరం జూన్‌, జూలైలో టీమ్‌ ఇండియా యూకే కు వెళ్తుంది. అక్కడ మొదట ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ ఆడుతుంది. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో ఒక టెస్టుతో పాటు టీ20, వన్డే సిరీస్‌ ఆడనుంది.