నటుడు విజయ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. తమిళనాడు ఇంటర్ పరీక్షల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో పాసైన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఇక ఫెయిలైన విద్యార్థులకు ధైర్యం చెప్పారు. మంచి జరుగుతుంది, విజయం ఖాయం అంటూ విజయ్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఇది కేవలం విద్యార్థులను ఉద్దేశించి మాత్రమే కాదని.. ప్రస్తుత తమిళ రాజకీయాలకు లింక్ పెట్టి విజయ్ ట్వీట్ చేశారని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
பன்னிரண்டாம் வகுப்புப் பொதுத் தேர்வில், விடாமுயற்சியால் வெற்றிக் கனியைச் சுவைத்த என் அன்புத் தம்பி, தங்கைகளுக்கு நெஞ்சார்ந்த வாழ்த்துகள்!
இந்த வெற்றி, உங்கள் கடின உழைப்பிற்குக் கிடைத்த அங்கீகாரம். உயர்கல்வி எனும் அடுத்த கட்டத்தை நோக்கி, நம்பிக்கையுடன் அடி எடுத்து வையுங்கள். அதே…
— TVK Vijay (@TVKVijayHQ) May 8, 2026
ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా హంగ్ అసెంబ్లీ ఏర్పడిన తమిళనాడుపై ఇప్పుడు దేశం మొత్తం దృష్టి పడింది. అధికారాన్ని ఎవరు చేపడతారనే స్పష్టత రాకపోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఆహ్వానించకపోవడంతో అసలు ఏం జరగనుందనే సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలోనే చిన్న పార్టీల మద్దతు కోసం విజయ్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో తమిళనాట రాజకీయ అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా విజయ్ చేసిన ట్వీట్ తమిళ రాజకీయాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
తాజాగా తమిళనాడు 12వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాలపై ఎక్స్ వేదికగా స్పందించిన టీవీకే అధినేత విజయ్.. ఇంటర్ పరీక్షల్లో పట్టుదలతో విజయం సాధించిన నా ప్రియమైన సోదర సోదరీమణులకు హృదయపూర్వక అభినందనలు అని పేర్కొన్నారు. పరీక్షల్లో విజయం మీ కఠోర శ్రమకు లభించిన గుర్తింపు అని తెలిపారు. ఆత్మవిశ్వాసంతో ఉన్నత విద్యలోని తదుపరి దశ వైపు అడుగు వేయండి అని హితవు పలికారు.
అదే సమయంలో ఈ పరీక్షల్లో విజయం సాధించని వారు నిరుత్సాహపడకూడదని, మళ్లీ ప్రయత్నించండి అంటూ ధైర్యాన్ని నింపారు. మనం విజయానికి చేరువలో ఉన్నామని గుర్తుంచుకోండి అంటూ వారికి భరోసా ఇచ్చారు. విద్యార్థులందరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు విజయ్ తెలిపారు. మంచి జరుగుతుంది, విజయం ఖాయం అంటూ విజయ్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
అయితే తమిళనాడులో నెలకొన్న పరిస్థితుల వేళ విజయ్ ఈ ట్వీట్ చేయడం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర ప్రాధాన్యం సంతరించుకుంది. తమిళనాట కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం టీవీకే పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో విజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కేవలం విద్యార్థుల్లోనే కాకుండా టీవీకే వర్గాలు, తన మిత్ర పార్టీలకు ఒక ధైర్యాన్నిచ్చేవి అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా తన రాజకీయ ప్రత్యర్థులకు కూడా ఇది ఒక బలమైన సంకేతమని భావిస్తున్నారు.
మరోవైపు, ఇవాళ విడుదలైన తమిళనాడు 12వ తరగతి బోర్డు పరీక్షల ఫలితాల్లో ఈ ఏడాది రికార్డు స్థాయి ఉత్తీర్ణత నమోదైనట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది 95.20 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. మరోవైపు, ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా అమ్మాయిలు 97 శాతం ఉత్తీర్ణతతో అబ్బాయిల 93.19 శాతం కంటే మెరుగైన ఫలితాలు సాధించారు. ఇక తమిళనాడులోని జిల్లాల పరంగా చూస్తే, ఈరోడ్ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది.
