తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే కూటమి ప్రభుత్వం ఆరు నెలలు కూడా అధికారంలో కొనసాగలేదని డీఎంకే సీనియర్ నేత, తిరుచెందూర్ ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ త్వరలోనే మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దక్షిణ తమిళనాడులో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న రాధాకృష్ణన్.. అధికార తమిళగ వెట్రి కళగం (టీవీకే) సీనియర్ నేత, విల్లివాక్కం ఎమ్మెల్యే ఆధవ్ అర్జునకు బహిరంగ సవాల్ విసిరారు.
‘‘ఈ ప్రభుత్వం మరో నాలుగు నెలలు మాత్రమే మనుగడ సాగిస్తుంది. ఆధవ్ అర్జున ధైర్యం ఉంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. నేను కూడా చేస్తాను. ఇద్దరం తిరుచెందూర్‌లో పోటీ చేద్దాం. ఇది మా అడ్డా. ఇక్కడ ఎవరినైనా ఓడిస్తాం’’ అని రాధాకృష్ణన్ సవాల్ విసిరారు. గత 25 ఏళ్లుగా తిరుచెందూర్ స్థానం రాధాకృష్ణన్‌కు బలమైన కోటగా ఉంది. కొళత్తూర్ స్థానంలో మాజీ డీఎంకే నేత వీఎస్ బాబు (టీవీకే) చేతిలో ఓడిపోయిన స్టాలిన్‌ను రాధాకృష్ణన్ ఈ సందర్భంగా వెనకేసుకొచ్చారు. కొళత్తూర్‌ను స్టాలిన్ సింగపూర్‌లా మార్చారని చెబుతూ.. అక్కడి ఓటర్లను ‘పనికిరానివారు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ నాయకుడు స్టాలిన్ తదుపరి ముఖ్యమంత్రి అవుతారని, ఆయనను తిరుచ్చి నుంచి పోటీ చేయిస్తామని చెప్పారు.
తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాల తర్వాత ద్రవిడ పార్టీల నుంచి అధికారం పోవడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 234 స్థానాలకుగానూ టీవీకే ఒంటరిగానే 108 సీట్లు గెలుచుకుని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 62 ఏళ్లుగా తమిళనాడును పాలిస్తున్న డీఎంకే, ఏఐఏడీఎంకేల జోరుకు విజయ్ బ్రేక్ వేశారు. ఈ నేపథ్యంలో అనితా రాధాకృష్ణన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఆయన వ్యాఖ్యలపై ఇప్పటి వరకు టీవీకే నేతలు స్పందించలేదు.
