తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం ద్వారా బలమైన సంకేతం పంపారు. తన అధికారిక కుర్చీపై అలంకరించే తెల్ల టవల్‌ను తొలగించి, బ్రిటిష్ కాలం నాటి వీఐపీ సంస్కృతికి స్వస్తి పలికారు. ఈ మార్పు ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా నిశ్శబ్దంగా జరగడం గమనార్హం.
మే 14న పరిశ్రమల శాఖ సమీక్షా సమావేశంలో విజయ్ కుర్చీపై టవల్ ఉండగా, మే 15న టాఫే ఛైర్‌పర్సన్ మల్లికా శ్రీనివాసన్‌తో భేటీ అయినప్పుడు టవల్ కనిపించలేదు. ఈ రెండు రోజుల ఫోటోలను పోల్చి చూడటంతో ఈ మార్పు వెలుగులోకి వచ్చింది.
ఈ నిర్ణయం వెనుక 14 ఏళ్ల పర్యావరణ కార్యకర్త లిసిప్రియా కంగుజమ్ చేసిన సోషల్ మీడియా అభ్యర్థన ఉంది. “భారతదేశంలో వీఐపీ కుర్చీలపై ఈ టవల్ సంస్కృతిని అంతం చేయగలరా? ముఖ్యమంత్రులు వీఐపీలని ప్రజలకు ఇప్పటికే తెలుసు” అని ఆమె ‘ఎక్స్’ వేదికగా విజయ్‌ను కోరారు. దీనికి ప్రభుత్వం అధికారికంగా స్పందించనప్పటికీ, 24 గంటల్లోనే మార్పు కనిపించింది. టవల్ లేని ఫోటోను షేర్ చేసిన లిసిప్రియా, “సామాన్య ప్రజల గొంతును మీరు విన్నారని ఈ చర్య నిరూపిస్తోంది” అంటూ హర్షం వ్యక్తం చేశారు.
సీనియర్ అధికారుల హోదాకు చిహ్నంగా మారిన ఈ టవల్ సంప్రదాయంపై భిన్న వాదనలు ఉన్నాయి. బ్రిటిష్ అధికారులు తమ ఫర్నిచర్‌ను భారతీయుల నుంచి కాపాడుకోవడానికి దీన్ని మొదలుపెట్టారని కొందరు చెబుతుండగా, ఇది కేవలం కుర్చీలను శుభ్రంగా ఉంచేందుకు మొదలై కాలక్రమేణా హోదాకు ప్రతీకగా మారిందని మరికొందరు విశ్లేషిస్తున్నారు.
