Udhayanidhi Stalin : తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ ఇవాళ మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడే ఈ ఉదయనిధి స్టాలిన్. దీన్నిబట్టి తన రాజకీయ వారసుడు ఉదయనిధి స్టాలిన్ అని ఎంకే స్టాలిన్ స్పష్టం చేసినట్లయింది. చెన్నైలోని రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈసందర్భంగా వి. సెంథిల్ బాలాజీ, డాక్టర్ గోవి చెజియాన్, ఆర్ రాజేంద్రన్, ఎస్ఎం నాసర్‌లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణను ఎదుర్కొనేందుకుగానూ సెంథిల్ బాలాజీ(Udhayanidhi Stalin) దాదాపు 471 రోజుల పాటు జైలులో ఉన్నారు. ఇటీవలే ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో సెంథిల్ బాలాజీ విడుదలయ్యారు.
Also Read :BJP Vs Mehbooba Mufti : ‘బంగ్లా’ హిందువుల గురించి ఎందుకు మాట్లాడరు ?.. ముఫ్తీకి బీజేపీ ప్రశ్న
ఈడీ అరెస్టు చేయడానికి ముందు తమిళనాడు రాష్ట్ర మంత్రిగా బాలాజీ ఉండేవారు. ఈనేపథ్యంలో మళ్లీ సెంథిల్ బాలాజీకి మంత్రిత్వ శాఖలను సీఎం ఎంకే స్టాలిన్ కట్టబెట్టారు. గతంలో ఆయన నిర్వహించిన విద్యుత్, ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖలను మరోసారి కేటాయించారు. డాక్టర్ గోవి చెజియాన్ తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా, ఆర్ రాజేంద్రన్‌కు పర్యాటక శాఖను అప్పగించారు. మైనారిటీల సంక్షేమం, ప్రవాస తమిళుల సంక్షేమ శాఖ మంత్రిగా ఎస్ఎం నాసర్‌ను నియమించారు. ఉదయనిధి స్టాలిన్ వద్ద ఇంతకుముందు క్రీడా శాఖ ఉండేది. ఇప్పుడు అదనంగా ఆయనకు తమిళనాడు ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ శాఖను కేటాయించారు. వాస్తవానికి ఉదయనిధి స్టాలిన్‌ను డిప్యూటీ సీఎం చేస్తారనే దానిపై గత నాలుగు నెలలుగా ముమ్మర ప్రచారం జరుగుతోంది. చివరకు ఆ ప్రచారమే నిజమని సీఎం ఎంకే స్టాలిన్ నిరూపించారు. తన కుమారుడికి కీలకమైన డిప్యూటీ సీఎం పదవిని అప్పగించారు. తద్వారా తన రాజకీయ వారసత్వాన్ని కుమారుడికి బదిలీ చేశారు.