Trainee Doctor : మరో జూనియర్ వైద్యురాలి సూసైడ్.. కాలేజీ బిల్డింగ్ పైనుంచి దూకి..

ఆదివారం రోజు రాత్రి ఆమె కాలేజీ క్యాంపస్‌లోని బిల్డింగ్ ఐదో అంతస్తులో కిటికీ దగ్గర చాలా సేపు కూర్చుంది.

Published By: HashtagU Telugu Desk
Trainee Doctor Tamil Nadu Medical College Building

Trainee Doctor : కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన యావత్ దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. దాన్ని మరువకముందే తమిళనాడులోని కాంచీపురంలో ఉన్న ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీలో దారుణం చోటుచేసుకుంది. ఓ ట్రెయినీ వైద్యురాలు(23) కాలేజీ క్యాంపస్‌లోని భవనం ఐదో అంతస్తు నుంచి దూకింది. తీవ్ర గాయాలపాలైన సదరు విద్యార్థిని ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచింది.

We’re now on WhatsApp. Click to Join

సదరు ట్రెయినీ వైద్యురాలు(Trainee Doctor) తిరునల్వేలి వాస్తవ్యురాలని తెెలిసింది. ఆమె ప్రస్తుతం కాంచీపురంలోని ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం(ఐదో ఏడాది) చదువుతోంది.  ఈక్రమంలో కాలేజీకి అనుబంధంగా ఉన్న హాస్పిటల్‌లో ట్రెయినీ డాక్టరుగా సేవలు అందిస్తోంది. ఆదివారం రోజు రాత్రి ఆమె కాలేజీ క్యాంపస్‌లోని బిల్డింగ్ ఐదో అంతస్తులో కిటికీ దగ్గర చాలా సేపు కూర్చుంది. ఏం జరిగిందో తెలియదు.. ఏం ఆలోచించుకుందో తెలియదు.. కానీ ఆమె భవనంపై నుంచి దూకి చేతులారా ప్రాణాలు తీసుకుంది.   దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం యువతి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వ్యక్తిగత కారణాల వల్లే సదరు ట్రెయినీ వైద్యురాలు సూసైడ్ చేసుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. ఆమె గతకొంతకాలంగా డిప్రెషన్‌లో ఉందని సన్నిహితుల ద్వారా పోలీసులు తెలుసుకున్నారు.

Also Read :Operation Bhediya : ‘ఆపరేషన్ భేడియా’ ఫెయిల్.. మరో చిన్నారిని చంపేసిన తోడేలు

మరోవైపు కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలిపై జరిగిన అఘాయిత్యంపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులు, అనుమానితులను సీబీఐ ప్రశ్నిస్తోంది. వారికి లై డిటెక్టర్ పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయి. అయితే కీలక నిందితుడు సంజయ్ రాయ్ లైడిటెక్టర్ పరీక్ష జరిగే క్రమంలో ఆసక్తికర సమాధానాలు చెప్పాడు. తాను జూనియర్ వైద్యురాలిని ఏమీ చేయలేదని అతడు స్పష్టం చేశాడు. కాలేజీ సెమినార్ హాలులోకి తాను వెళ్లే సమయానికే ఆమె చనిపోయి, రక్తపు మడుగులో పడి ఉందన్నాడు. కొంతమంది కలిసి తనను బలిపశువును చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశాడు.

Also Read :International Coconut Day: ఆరోగ్యం కల్పవృక్షం కొబ్బరిలో దాగున్న రహస్యాలు..!

  Last Updated: 02 Sep 2024, 04:26 PM IST