Army Pilot Proposes: ప్రియురాలి కోసం ఆర్మీ పైలట్ చేసిన పని వైరల్

మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న కంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్ (సీఏఏటీఎస్‌) ఒక అరుదైన ప్రేమ ఘట్టానికి వేదికైంది. తన పైలట్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఓ ఆర్మీ కెప్టెన్, అదే వేదికపై తన ప్రియురాలికి చేసిన రొమాంటిక్ ప్రపోజల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నప్పటికీ, కొందరు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ కెప్టెన్ భరత్ భరద్వాజ్ నాసిక్‌లోని సీఏఏటీఎస్‌లో […]

Published By: HashtagU Telugu Desk
The gesture an Army pilot made for his girlfriend goes viral.

The gesture an Army pilot made for his girlfriend goes viral.

మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న కంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్ (సీఏఏటీఎస్‌) ఒక అరుదైన ప్రేమ ఘట్టానికి వేదికైంది. తన పైలట్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఓ ఆర్మీ కెప్టెన్, అదే వేదికపై తన ప్రియురాలికి చేసిన రొమాంటిక్ ప్రపోజల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నప్పటికీ, కొందరు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ కెప్టెన్ భరత్ భరద్వాజ్ నాసిక్‌లోని సీఏఏటీఎస్‌లో తన ఫ్లైట్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. ఈ నెల‌ 2న జరిగిన పాసింగ్-అవుట్ పరేడ్ అనంతరం ఆయన తన ప్రియురాలు అరుషికి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. తన వృత్తి జీవితంలో కీలక మైలురాయిని అందుకున్న రోజే, వ్యక్తిగత జీవితంలోనూ మరో అడుగు ముందుకు వేయాలని నిర్ణయించుకున్నారు.

సైనిక వేడుకల కోసం ధరించిన యూనిఫాంలోనే, పక్కనే పార్క్ చేసి ఉన్న ఆర్మీ హెలికాప్టర్ ముందు, తన ప్రియురాలి ఎదుట మోకాళ్లపై కూర్చుని ఉంగరంతో ప్రేమను వ్యక్తపరిచారు. ఈ అనూహ్య పరిణామానికి ఆశ్చర్యపోయిన అరుషి, ఆనందంతో బాయ్‌ఫ్రెండ్‌ ప్ర‌పోజ‌ల్‌ను అంగీకరించారు. అక్కడున్న తోటి అధికారులు, కుటుంబసభ్యులు, శిక్షకులు చప్పట్లతో ఆ జంటను అభినందించారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైర‌ల్ అయ్యాయి. ఏఎన్ఐతో మాట్లాడుతూ కెప్టెన్ భరద్వాజ్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. “మేమందరం ఈరోజు పైలట్లుగా మారాం. మా కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఐదేళ్లుగా మా ఇద్దరికీ పరిచయం ఉంది. ఆమెకు పెళ్లి ప్రపోజ్ చేయడానికి ఇంతకంటే మంచి రోజు ఉండదని భావించాను. ఈ రోజును నా కాబోయే భార్యకు కూడా చిరస్మరణీయంగా మార్చాలనుకున్నా” అని ఆయన వివరించారు.

ప్రశంసలతో పాటు విమర్శలు!
అయితే, ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలామంది నెటిజన్లు ఇది సినిమాలా ఉందని, ఎంతో రొమాంటిక్‌గా ఉందని ప్రశంసించారు. జీవితంలో ఒక ముఖ్యమైన విజయాన్ని అందుకున్న రోజున, ప్రేమించిన వ్యక్తితో ఆ ఆనందాన్ని పంచుకోవడం అద్భుతమని కామెంట్లు చేశారు.

మరోవైపు కొందరు ఈ తీరును తప్పుబట్టారు. “అత్యంత క్రమశిక్షణతో కూడిన సైనిక శిక్షణా కేంద్రంలో అధికారులు యూనిఫాంలో ఉన్నప్పుడు ఇలాంటి వ్యక్తిగత కార్యక్రమాలు సరికాదు” అని ఒకరు అభిప్రాయపడ్డారు. “ఆర్మీ ఏవియేషన్ స్కూల్‌కు గొప్ప విలువలు, చరిత్ర ఉన్నాయి. ఇలాంటివి ప్రాంగణం వెలుపల జరిగి ఉంటే బాగుండేది” అని మరొకరు పేర్కొన్నారు. “యూనిఫాం అనేది కర్తవ్యం, క్రమశిక్షణ, ప్రజా విశ్వాసానికి ప్రతీక. వ్యక్తిగత క్షణాలను జరుపుకునేటప్పుడు దాని గౌరవాన్ని కాపాడాలి” అని ఇంకొక యూజర్ హితవు పలికారు. మొత్తానికి ఈ ప్రేమ ప్రతిపాదన సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చకు దారితీసింది.

  Last Updated: 03 Jun 2026, 10:37 AM IST