Chandrababu Naidu: గోదావరి పుష్కరాలకు చంద్రబాబు కీలక ప్రకటన..

గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. 2014-19 మధ్య కాలంలో తమ ప్రభుత్వం 72% పనులు పూర్తి చేస్తే, గడిచిన ఐదేళ్లలో గత ప్రభుత్వం కేవలం 2% పనులు మాత్రమే చేసి డయాఫ్రమ్ వాల్‌ను గోదావరి పాలు చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులను పరుగులు పెట్టిస్తున్నామని, ప్రాజెక్టును 89 శాతం పూర్తి చేశామని తెలిపారు. పోలవరం నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం […]

Published By: HashtagU Telugu Desk
Chandrababu makes a key announcement regarding the Godavari Pushkarams.

Chandrababu makes a key announcement regarding the Godavari Pushkarams.

గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. 2014-19 మధ్య కాలంలో తమ ప్రభుత్వం 72% పనులు పూర్తి చేస్తే, గడిచిన ఐదేళ్లలో గత ప్రభుత్వం కేవలం 2% పనులు మాత్రమే చేసి డయాఫ్రమ్ వాల్‌ను గోదావరి పాలు చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులను పరుగులు పెట్టిస్తున్నామని, ప్రాజెక్టును 89 శాతం పూర్తి చేశామని తెలిపారు. పోలవరం నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం అందించి న్యాయం చేస్తామన్నారు.

ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త కళ

పర్యటనలో భాగంగా తొలుత ధవళేశ్వరం వద్ద సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి రూ.152 కోట్ల వ్యయంతో 117 కొత్త గేట్ల ఏర్పాటు పనులను చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోదావరి డెల్టాకు కాటన్ దొర చేసిన సేవలను స్మరించుకున్నారు. బ్యారేజీ గేట్లు, ఎలక్ట్రికల్ వ్యవస్థలు దెబ్బతింటే గత ప్రభుత్వం కనీసం గ్రీజు కూడా పెట్టలేదని, తమ ప్రభుత్వం 9 నెలల్లో కొత్త గేట్లను అమరుస్తుందని తెలిపారు. త్వరలో అఖండ గోదావరి ప్రాజెక్టును కూడా తీసుకొస్తామని ప్రకటించారు.

‘గొడ్డలి పార్టీ’తోనే సమస్య

గత ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో గంజాయిని ప్రోత్సహించి యువత భవిష్యత్తును నాశనం చేశారని ఆరోపించారు. “నాకు రౌడీలు, బ్లేడ్ బ్యాచ్‌లతో సమస్య లేదు. కానీ ఇప్పుడు గొడ్డలి పార్టీతోనే సమస్య వస్తోంది. వారు పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులపై కూడా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడే వారికి స్టూడియోలు పెట్టిస్తూ ఫైనాన్స్ చేస్తున్నారు” అని మండిపడ్డారు. గంజాయి మత్తులో ఆడబిడ్డల జోలికి వస్తే వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు.

రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా, ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఈ నెలలోనే ‘తల్లికి వందనం’ నిధులు జమ చేస్తామని, ‘అన్నదాత సుఖీభవ’ కింద రైతులకు సాయం అందించామని గుర్తుచేశారు. కోనసీమకు రైల్వే లైన్ తీసుకురావడంతో పాటు, పిచ్చుకలంక, బొజ్జర్లంక ప్రాంతాల్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గోదావరి జిల్లాల ప్రజలు 2024 ఎన్నికల్లో అఖండ మెజార్టీ ఇచ్చి తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చంద్రబాబు పేర్కొన్నారు.

  Last Updated: 13 Jul 2026, 04:19 PM IST