TVK Keerthana: టీవీకే శివకాశి ఎమ్మెల్యేగా తెలుగు మహిళా కీర్తన

తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ సృష్టించిన సంచలనాలు కొనసాగుతున్నాయి. ఎందరో సామాన్యులను అసెంబ్లీకి పంపిన ఆ పార్టీ నుంచి ఇప్పుడు మరో ఆసక్తికరమైన విజేత కథ వెలుగులోకి వచ్చింది. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని ఒక యువతి, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందంలో పనిచేసిన అనుభవంతో తన నియోజకవర్గంలో తెలుగులో ప్రసంగించి మరీ ఓటర్ల మనసులు గెలుచుకున్నారు. ఆమే విరుద్‌నగర్‌ జిల్లా శివకాశి నియోజకవర్గ నూతన […]

Published By: HashtagU Telugu Desk
Telugu Mahila Keerthana as TVK, Sivakasi MLA

Telugu Mahila Keerthana as TVK, Sivakasi MLA

తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ సృష్టించిన సంచలనాలు కొనసాగుతున్నాయి. ఎందరో సామాన్యులను అసెంబ్లీకి పంపిన ఆ పార్టీ నుంచి ఇప్పుడు మరో ఆసక్తికరమైన విజేత కథ వెలుగులోకి వచ్చింది. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని ఒక యువతి, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందంలో పనిచేసిన అనుభవంతో తన నియోజకవర్గంలో తెలుగులో ప్రసంగించి మరీ ఓటర్ల మనసులు గెలుచుకున్నారు. ఆమే విరుద్‌నగర్‌ జిల్లా శివకాశి నియోజకవర్గ నూతన ఎమ్మెల్యే కీర్తనా సంపత్.

వ్యూహకర్త నుంచి ప్రజా ప్రతినిధిగా..
కీర్తనా సంపత్ ప్రస్థానం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ పూర్తి చేసిన ఆమె, డేటా అనలిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. తన ప్రతిభతో దేశంలోనే ప్రముఖ రాజకీయ వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిశోర్ (ఐప్యాక్) బృందంలో చేరారు. గోవా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఎన్నికల్లో తెరవెనుక వ్యూహరచనలో కీలక పాత్ర పోషించారు. 2021 తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ గెలుపు కోసం కూడా పనిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్ కేంద్రంగా టీడీపీ సోషల్ మీడియా విభాగానికి ఆమె నాయకత్వం వహించారు. ఈ క్రమంలోనే ఆమెకు తెలుగు భాషపై మంచి పట్టు లభించింది.

సొంతూరి సమస్యలపై పోరాటం
దేశవ్యాప్తంగా ఎందరో నేతల గెలుపు కోసం వ్యూహాలు రచించిన కీర్తనను తన సొంత ప్రాంతంలోని సమస్యలు తీవ్రంగా ఆలోచింపజేశాయి. బాణాసంచా పరిశ్రమకు కేంద్రమైన శివకాశిలో తరచూ జరిగే అగ్ని ప్రమాదాలు, కార్మికుల మరణాలు ఆమెను కలచివేశాయి. తాగునీరు, సరైన రోడ్లు, వైద్య సదుపాయాలు వంటి కనీస మౌలిక వసతులు లేకపోవడం, ఉన్నత చదువులు చదివిన యువత ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లడం లేదా స్థానికంగా టాక్సీ డ్రైవర్లుగా మిగిలిపోవడం వంటి అంశాలు ఆమెను రాజకీయాల వైపు నడిపించాయి. దీంతో లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి సొంతూరికి తిరిగి వచ్చారు.

విజయ్ అవకాశం.. తెలుగులో ప్రచారం.. చారిత్రక విజయం
సొంతూరికి వచ్చిన కీర్తన.. సోషల్ మీడియా ద్వారా స్థానిక సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడం ప్రారంభించారు. స్వచ్ఛంద సంస్థలతో కలిసి విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇస్తూ చాలా తక్కువ సమయంలోనే ప్రజల మన్ననలు పొందారు. ఆమె ప్రజాదరణను గమనించిన టీవీకే అధినేత విజయ్, ఎన్నికలకు కేవలం నెల రోజుల ముందు ఆమెకు శివకాశి టికెట్ కేటాయించారు. ప్రచారంలో తనదైన ముద్ర వేసిన కీర్తన, నియోజకవర్గంలోని తెలుగు ఓటర్లను ఆకట్టుకోవడానికి తెలుగులో ప్రసంగించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె వినూత్న ప్రచార శైలి, స్థానిక సమస్యలపై ఆమెకున్న అవగాహన ఓటర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఫలితంగా ఆమె ప్రత్యర్థులపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. అంతేగాక‌ శివకాశి నియోజకవర్గ చరిత్రలోనే తొలి మహిళా ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. ఒక డేటా అనలిస్ట్ ప్రజా ప్రతినిధిగా మారిన ఆమె కథ, యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

  Last Updated: 06 May 2026, 10:35 AM IST