తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి, డీఎంకే-అన్నాడీఎంకేల ఆధిపత్యానికి గండికొట్టిన నటుడు విజయ్ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం'(టీవీకే)కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.
కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. టీవీకేకు మద్దతు ఇచ్చే అధికారాన్ని తమిళనాడు కాంగ్రెస్ కమిటీకి (టీఎన్‌సీసీ) అప్పగించినట్లు కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంథిల్ తెలిపారు. విజయ్ ప్రభుత్వంలో రెండు మంత్రి పదవులు ఆశిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఎన్డీయే లేదా దాని మిత్రపక్షాలతో కలవకూడదనే షరతును కాంగ్రెస్ పెట్టింది.
234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో టీవీకే 108 సీట్లు గెలుచుకుంది. మెజారిటీకి కేవలం 10 సీట్ల దూరంలో నిలిచింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్న 5 సీట్లతో వారి బలం 113కు చేరింది. త్వరలోనే గవర్నర్‌ను కలిసి మద్దతు లేఖను సమర్పించనున్నారు. దీంతో విజయ్ రేపటికల్లా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి.
కాంగ్రెస్ తాజా నిర్ణయంతో దశాబ్దాలుగా కొనసాగుతున్న డీఎంకే-కాంగ్రెస్ కూటమి విచ్ఛిన్నమైంది. ఈ పరిణామంపై డీఎంకే తీవ్రంగా స్పందించింది. ఇది ‘వెన్నుపోటు’ అని డీఎంకే అధికార ప్రతినిధి ఎ. శరవణన్ ఆరోపించారు. తమ మద్దతు లేకుండా కాంగ్రెస్ ఆ ఐదు సీట్లు కూడా గెలిచేది కాదని ఆయన విమర్శించారు.
