Site icon HashtagU Telugu

Tamilisai : తమిళనాడు బీజేపీ చీఫ్ రేసులో తమిళిసై.. ప్లస్‌‌లు, మైనస్‌లు ఇవే

Tamilisai Soundararajan Tamil Nadu Bjp Chief Annamalai

Tamilisai : తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి కె అన్నామలై రాజీనామా చేశారు. దీంతో ఆ పదవి కోసం తెరపైకి నాలుగు కొత్త పేర్లు వచ్చాయి. ఇందులో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా ఉన్నారు. అన్నామలైని తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తేనే,  తాము పొత్తు కుదుర్చుకుంటామని ఇటీవలే బీజేపీ అగ్రనేత అమిత్‌షాకు అన్నాడీఎంకే అధ్యక్షుడు పళనిస్వామి తేల్చి చెప్పారట. అందుకే అన్నామలైకు నచ్చజెప్పి మరీ  రాజీనామా చేయించారట. అన్నా డీఎంకేతో సన్నిహితంగా మసులుకోగలిగే నేతను ఇప్పుడు తమిళనాడు బీజేపీ చీఫ్ చేయబోతున్నారు. ఈ లిస్టులో మొదటిపేరు తమిళిసైదే అని తెలుస్తోంది.

Also Read :Lucknow Super Giants: చివ‌రి బంతి వ‌ర‌కు ఉత్కంఠ‌.. ల‌క్నోపై పోరాడి ఓడిన ముంబై ఇండియ‌న్స్‌!

తమిళిసై ప్లస్ పాయింట్స్

అన్నా డీఎంకే నేతలతో తమిళిసై(Tamilisai)కు మంచి సంబంధాలు ఉన్నాయి.  2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూరాంటే, పొత్తులు పెట్టుకోక తప్పదు. లేదంటే ఒంటరిగా ఆ రాష్ట్రంలో బీజేపీ రాణించే ఛాన్సే లేదు. మరోసారి మిత్రపక్షంగా మారబోతున్న అన్నా డీఎంకేను కలుపుకొని నడిచే నాయకత్వ లక్షణాలు తమిళిసైలో ఉన్నాయని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నారట. గతంలో తెలంగాణ గవర్నర్ హోదాలో ఆమె చాకచక్యంగా వ్యవహరించారు. కేసీఆర్ లాంటి రాజకీయ చాణక్యుడు సీఎం సీటులో ఉన్నా.. తగ్గేదేలే అన్నట్టుగా తనదైన శైలిలో రాజ్‌భవన్ నుంచి పావులు కదిపారు. ఆనాడు గవర్నర్ హోదాలో తెలంగాణ బీజేపీకి ప్లస్ పాయింట్లను క్రియేట్ చేయడంలో తమిళిసై సక్సెస్ అయ్యారు. స్వతంత్రంగా, సొంత నిర్ణయాలు తీసుకున్నారు.   ఈ అంశాలన్నీ బీజేపీ పెద్దలకు తెలుసు. అందుకే ఈసారి తమిళనాడు బీజేపీ చీఫ్ పదవి కోసం తమిళిసై పేరును పరిశీలిస్తున్నారట. ఆమె కోరుకుంటున్నది కూడా అదే.

తమిళిసై మైనస్ పాయింట్స్

గతంలోనూ రాష్ట్ర బీజేపీ చీఫ్‌గా పనిచేసిన అనుభవం తమిళిసైకి ఉంది. కేంద్ర నాయకత్వంతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఆమెకు ప్లస్ పాయింట్స్. అయితే గతంలో రాష్ట్ర బీజేపీ చీఫ్‌గా ఆశించిన మేర ఫలితాలను తమిళిసై సాధించలేకపోయారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ చెన్నై లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఆమె ఓడిపోయారు. ఇలాంటి అంశాలు నెగెటివ్‌గా మారే అవకాశం ఉంది.

కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్ సైతం.. 

తమిళనాడు బీజేపీ చీఫ్ పోస్టు కోసం  ప్రస్తుత కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్,  కోయంబత్తూరు సౌత్ ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్, సీనియర్ నేత  నైనార్ నాగేంద్రన్‌ పేర్లను కూడా పార్టీ పెద్దలు పరిశీలించే అవకాశం ఉంది. వీరిలో ఎల్. మురుగన్‌కే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈయన ప్రస్తుతం కేంద్ర మంత్రి హోదాలో బీజేపీ పెద్దలతో టచ్‌లో ఉన్నారు. ఒకవేళ మహిళలకు అవకాశం ఇవ్వాలని భావిస్తే మాత్రం.. ప్రధాన పోటీ తమిళిసై,  వనతి శ్రీనివాసన్‌ల మధ్యే ఉంటుంది. ఇక నైనార్ నాగేంద్రన్‌ గతంలో అన్నా డీఎంకేలో ఉండేవారు. ఆ తర్వాతే బీజేపీలో చేరారు. ఇప్పుడు అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకోబోతోంది. అన్నా డీఎంకేపై అవగాహన కలిగిన నేతగా నైనార్ నాగేంద్రన్‌ పేరును బీజేపీ పెద్దలు పరిశీలించే అవకాశం లేకపోలేదు.

Also Read :Earthquake: నేపాల్‌లో మరోసారి భారీ భూకంపం.. రిక్ట‌ర్ స్కేల్‌పై తీవ్ర‌త ఎంతంటే?