Wayanad Win : ప్రియాంకకు 3 లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీ.. ఢిల్లీ ఆఫీసుకు రాబర్ట్ వాద్రా
Pasha
Wayanad Win : కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ విజయం దిశగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఆమె విజయం దాదాపు ఖాయమైంది. ఎందుకంటే ప్రస్తుతం ఆమె దాదాపు 3 లక్షల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కచ్చితంగా చెప్పాలంటే.. ఈ వార్త పబ్లిష్ అయ్యే సమయానికి ప్రియాంకాగాంధీకి 3 లక్షల 4వేల 920 ఓట్ల ఆధిక్యం ఉంది. ఆమెకు మొత్తం 4 లక్షల 61వేల 566 ఓట్లు వచ్చాయి. వయనాడ్‌లో ప్రియాంకాగాంధీపై సీపీఐ నుంచి సత్యన్ మోకేరి, బీజేపీ నుంచి నవ్య హరిదాస్ పోటీ చేశారు. సత్యన్ మోకేరి 1.56 లక్షల ఓట్లతో వెనుకంజలో ఉండగా నవ్య హరిదాస్ 84వేల ఓట్లతో వెనుకంజలో ఉన్నారు.
ఈ ఎన్నికల్లో ప్రియాంకాగాంధీకి దాదాపు 9 లక్షల దాకా ఓట్లు పోలవుతాయని కేరళ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఆ లెక్క ప్రకారం ఆమె మెజారిటీ మరింత పెరిగే అవకాశం ఉంది. గత వయనాడ్ లోక్‌సభ ఎన్నికల విషయానికి వస్తే.. 2019లో రాహుల్ గాంధీకి 4.3 లక్షల ఓట్ల మెజారిటీ వచ్చింది. 2024 ఎన్నికల్లో ఆయనకు 3.6 లక్షల ఓట్ల మెజారిటీ వచ్చింది. సతీమణి ప్రియాంకాగాంధీ వయనాడ్ నుంచి గెలవబోతున్న తరుణంలో రాబర్ట్ వాద్రా(Wayanad Win) ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీలోని తన కార్యాలయానికి చేరుకున్నారు. ఈసందర్భంగా ఆయన అక్కడున్న మీడియా ప్రతినిధులకు అభివాదం చేశారు. వయనాడ్ ఎన్నిక పూర్తి ఫలితాలు వెలువడిన తర్వాత మళ్లీ వచ్చి మాట్లాడుతానని మీడియా ప్రతినిధులకు తెలిపారు. వయనాడ్‌లో ప్రియాంక గెలిస్తే.. పార్లమెంటులో ఒకేసారి మనం ప్రియాంక, రాహుల్, సోనియా గాంధీలను చూడొచ్చు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఇది ప్రియాంకాగాంధీకి తొలి విజయం.
వయనాడ్ ఎన్నికల ఫలితాలపై కేరళ బీజేపీ అధికార ప్రతినిధి టామ్ వడక్కన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘వయనాడ్ ఎన్నికల్లో ఎవరు గెలిచారన్నది ముఖ్యం కాదు. మీకు ఎవరు సపోర్ట్ చేశారన్నది ముఖ్యం. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ), ఎస్‌డీపీఐ లాంటి సంస్థల మద్దతును కాంగ్రెస్ తీసుకుంది. అవి రెండూ సంఘ విద్రోహ సంస్థలు. దేశ వ్యతిరేక సంస్థల సహకారంతో ఎన్నికల్లో గెలవడం సరికాదు’’ అని ఆయన కామెంట్ చేశారు.