Karnataka Politics: బీజేపీతో ‘కిచ్చా’.. కర్ణాటకలో పొలిటికల్ ప్రకంపనలు!

తాజాగా కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ భారతీయ జనతా పార్టీ (బిజెపి) కోసం ప్రచారం చేస్తానని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

  • Written By:
  • Updated On - April 12, 2023 / 10:35 AM IST

కర్ణాటక (Karnataka) లో రాజకీయ వేడెక్కుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ నువ్వానేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. ఇరు పార్టీలు ఎన్నికల ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ (Kichcha Sudeep) భారతీయ జనతా పార్టీ (బిజెపి) కోసం ప్రచారం చేస్తానని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. బీజేపీకి మద్దతు ఇవ్వడం పట్ల కిచ్చా సుదీప్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సౌత్ స్టార్ ప్రకాష్ రాజ్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. సుదీప్ బీజేపీని ఎంచుకున్నందుకు ఆయన నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.

కిచ్చా సుదీప్ పై ప్రకాశ్ రాజ్ ఫైర్

ప్రకాశ్ రాజ్ (Prakash Raj) ట్విటర్‌లో ఇలా వ్రాస్తూ “ప్రియమైన సుదీప్.. అందరూ ఇష్టపడే ఆర్టిస్ట్‌గా.. మీరు ప్రజల గొంతుక అవుతారని నేను ఆశించాను. కానీ మీరు రాజకీయ పార్టీతో రంగులు వేయాలని ఎంచుకున్నారు.. సరే.. సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి.. ప్రతి పౌరుడు అడిగే ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు రెడీగా ఉండండి’’ అంటూ రియాక్ట్ అయ్యాడు. కిచ్చా సుదీప్ బీజేపీలో చేరుతారనే ఊహాగానాల మధ్య జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించాడు. సీఎం బసవరాజ్ బొమ్మైతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిచ్చా సుదీప్ మాట్లాడుతూ, “నేను ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, నేను ఏ వేదిక లేదా డబ్బు కోసం ఇక్కడకు రాలేదు. ఒక వ్యక్తి కోసమే ఇక్కడికి వచ్చాను. నాకు సీఎం అంటే ఎంతో గౌరవం. అందుకే బొమ్మై సార్‌కి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటిస్తున్నాను. మీరు బీజేపీ సిద్ధాంతంతో ఏకీభవిస్తారా అని అడిగిన ప్రశ్నకు సుదీప్.. “ఒక పౌరుడిగా, ప్రధాని మోదీ తీసుకున్న కొన్ని నిర్ణయాలను నేను పూర్తిగా గౌరవిస్తాను, కానీ అది నా దృక్పథం’’ అని తేల్చి చెప్పారు. సుదీప్ ఏ రాజకీయ పార్టీకి చెందినవాడు కాదని కర్ణాటక సీఎం బొమ్మై చెప్పారు. సుదీప్ మాటలపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ “కిచ్చా సుదీప్ (Kichcha Sudeep) ప్రకటనతో నేను షాక్ అయ్యాను. అంతేకాదు.. బాధపడ్డాను” అని ప్రకాశ్ రాజ్ తన ట్విట్టర్ లో తెలియజేశారు.

సినిమాలు వేరు రాజకీయాలు వేరు : డీకే

క‌న్న‌డ స్టార్ హీరో కిచ్చ సుదీప్ (Kichcha Sudeep) బీజేపీకి మద్దతు ప్రకటించడాన్ని ఇతర పార్టీల నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. కర్ణాటకలో సుదీప్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో ఆయన మద్దతు కోసం కర్ణాటకలోని ప్రధాన పార్టీలన్నీ ప్రయత్నించాయి. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కూడా ఆయనతో సంప్రదింపులు జరిపాయి. అయితే సుదీప్ మాత్రం బీజేపీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. సుదీప్ బీజేపీకి మద్దతు ప్రకటించడంపై కర్ణాటకలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సుదీప్ బీజేపీకి మద్దతు ప్రకటించడం పట్ల కర్ణాటక కాంగ్రెస్ అగ్ర నేత డీకే శివకుమార్ స్పందిస్తూ.. రాజకీయాలు, సినిమాలు వేరని, అది ఒకదానిపై మరొకటి ప్రభావం చూపెట్టలేవని వ్యాఖ్యానించారు. కాగా మే 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Also Read: Traffic Restrictions: మోడీ హైదరాబాద్ టూర్.. సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు!