Voting Begins : కర్ణాటకలో పోలింగ్ షురూ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్(Voting Begins) మొదలైంది. ఓటర్లు ఉదయం 7 నుంచే పోలింగ్ కేంద్రాల ఎదుట బారులు తీరారు.

  • Written By:
  • Updated On - May 10, 2023 / 10:32 AM IST

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్(Voting Begins) మొదలైంది. ఓటర్లు ఉదయం 7 నుంచే పోలింగ్ కేంద్రాల ఎదుట బారులు తీరారు. హై వోల్టేజ్ ప్రచారం తర్వాత కర్ణాటకలో ఇవాళ ఓట్ల పండుగ జరుగుతోంది. 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 58,545 పోలింగ్‌ కేంద్రాల్లో మొత్తం 5,31,33,054 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

కర్నాటకలో అధిక సంఖ్యలో పోలింగ్ నమోదు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ఓటర్లకు  పిలుపునిచ్చారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ‘విజ్ఞతతో ఓటు వేయాలని’ ఓటర్లను కోరింది.చిక్కమగళూరులోని పోలింగ్ బూత్ నంబర్ 165లో ఓ వధువు ఓటు వేసింది. ఇప్పటివరకు ఓటు వేసిన ప్రముఖుల్లో  నిర్మలా సీతారామన్, BS యడియూరప్ప, NR నారాయణ మూర్తి, సుధా మూర్తి, రాజమాత ప్రమోదా దేవి వడియార్, బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ తదితరులు ఉన్నారు. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఓటు వేసిన తర్వాత  మాట్లాడుతూ.. “నేను ఓటు వేసి ప్రజాస్వామ్యం పట్ల నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను. నా నియోజకవర్గంలో ఓటు వేయడం సంతోషంగా ఉంది. నేను రికార్డు మెజారిటీతో గెలుస్తాను. కర్ణాటక ప్రజలు సానుకూల అభివృద్ధి కోసం ఓటు వేస్తారు.

బీజేపీకి తగినంత మెజారిటీ వస్తుంది” అని చెప్పారు. సాయంత్రం పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడనున్నాయి. చాలా ఒపీనియన్ పోల్స్ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. ఇంకొన్ని ప్రీ-పోల్ సర్వేలు ప్రతిపక్ష బీజేపీ వైపు జనం మొగ్గు చూపుతున్నట్లు తెలిపాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాలు మే 13న (శనివారం) వెలువడనున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 113 సీట్ల మెజారిటీ అవసరం. వచ్చే ఏడాది మేలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు.. కర్ణాటక పోల్స్ ఫలితాలు సెమీ ఫైనల్ లాంటివని రాజకీయ వర్గాలు అంటున్నాయి .

ఉత్తరప్రదేశ్, ఒడిశా, మేఘాలయలోని నాలుగు అసెంబ్లీ స్థానాలలో..

మరోవైపు ఉత్తరప్రదేశ్, ఒడిశా, మేఘాలయలోని నాలుగు అసెంబ్లీ స్థానాలతో పాటు పంజాబ్‌లోని ఒక లోక్‌సభ స్థానానికి ఇవాళ పోలింగ్ (Voting Begins) జరుగుతోంది . ఉత్తరప్రదేశ్‌లోని సువార్‌, ఛన్‌బే స్థానాలు, ఒడిశాలోని ఝర్సుగూడ, మేఘాలయలోని సోహియాంగ్‌ అసెంబ్లీ స్థానాలకు.. పంజాబ్‌లోని జలంధర్ లోక్‌సభ స్థానానికి పోల్ (Voting Begins) జరుగుతోంది. కాంగ్రెస్ ఎంపీ సంతోక్ సింగ్ చౌదరి మరణంతో జలంధర్ స్థానం ఖాళీ అయింది. ఈ ఏడాది జనవరిలో జలంధర్‌లోని ఫిలింనగర్‌లో పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఆయన గుండెపోటుతో మరణించారు. ఈ స్థానంలో ఆప్, బీజేపీ, కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ మధ్య తీవ్ర పోటీ ఉంది. కాంగ్రెస్‌ తరఫున సంతోక్ చౌదరి భార్య కరమ్‌జిత్ కౌర్, బరిలో నిలవగా..ఆప్ నుంచి సుశీల్ కుమార్ రింకూ, శిరోమణి అకాలీదళ్ – బీఎస్పీ కూటమి తరఫున సుఖ్‌విందర్ కుమార్ సుఖి, బీజేపీ నుంచి ఇందర్ ఇక్బాల్ సింగ్ అత్వాల్‌ పోటీ చేస్తున్నారు. దళితులు అధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలు 27 రోజుల పాటు విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. పంజాబ్‌లో దళితులు 32% మంది ఉన్నారు. ఇది ఇతర అన్ని రాష్ట్రాల కంటే అత్యధికం.

ALSO READ : Telangana Elections: పార్లమెంట్ తో తెలంగాణ ఎన్నికలు?

ఇక ఉత్తరప్రదేశ్‌లోని సువార్, ఛన్‌బే స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ కూటమి , ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఛన్‌బేలో మాత్రమే తన అభ్యర్థిని నిలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 27న మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే అప్పుడు సోహియోంగ్‌ స్థానం నుంచి బరిలోకి దిగిన యూడీపీ అభ్యర్థి హెచ్డీఆర్ లింగ్దో ఆకస్మికంగా మరణించారు. దీంతో అప్పుడు వాయిదా వేసిన ఎన్నికను ఇప్పుడు నిర్వహిస్తున్నారు.