తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార డీఎంకే (DMK), ప్రతిపక్ష ఏఐఏడీఎంకే (AIADMK) మధ్య ప్రధాన పోటీ నెలకొనగా, దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ తొలిసారి ఎన్నికల బరిలో నిలవడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా, ముఖ్యంగా తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమి వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే దక్షిణాదిలో అపారమైన క్రేజ్ ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను రంగంలోకి దించింది. గతంలో మధురైలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరైనప్పుడు పవన్‌కు లభించిన భారీ స్పందనను దృష్టిలో ఉంచుకుని, ఆయన ప్రచారం కూటమికి పెద్ద ప్లస్ అవుతుందని బీజేపీ భావిస్తోంది.
సత్తూరు నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ – నైనార్ నాగేంద్రన్ కోసం ప్రచారం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ పోటీ చేస్తున్న సత్తూరు నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నియోజకవర్గంలో తెలుగు మాట్లాడే ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉండటం, పవన్‌కు ఇక్కడ భారీ స్థాయిలో అభిమాన గణం ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. గత ఏడాది మధురైలో తమిళ సాంప్రదాయక పంచెకట్టుతో పవన్ చేసిన సందడి ఇంకా అభిమానుల కళ్లముందే ఉంది. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కల్యాణ్ చేసే ప్రసంగాలు, రోడ్ షోలు తెలుగు మరియు తమిళ ఓటర్లను ఏ మేరకు ప్రభావితం చేస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే దళపతి విజయ్ ఒంటరి పోరుకు సిద్ధమవడంతో, పవన్ రాకతో కూటమికి కొత్త ఊపు వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మేనిఫెస్టోల హోరు.. ఏప్రిల్ 23న పోలింగ్
మరోవైపు, ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఇటీవలే ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి 297 హామీలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేశారు. మహిళలకు ఉచిత ఏసీలు, స్టడీ లోన్ల మాఫీ, పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ఆకర్షణీయమైన పథకాలను అందులో చేర్చారు. ఏప్రిల్ 23న తమిళనాడువ్యాప్తంగా పోలింగ్ జరగనుండగా, మే 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. పవన్ కల్యాణ్ ప్రచారం కేవలం సత్తూరుకే పరిమితం అవుతుందా లేక మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయన పర్యటిస్తారా అనే దానిపై త్వరలోనే స్పష్టత రానుంది. ఏదేమైనా పవన్ ఎంట్రీతో తమిళ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
