Site icon HashtagU Telugu

Deve Gowda : నేరం రుజువైతే నా మనవడిపై చర్యలు తీసుకోవాల్సిందే : దేవెగౌడ

Deve Gowda

Deve Gowda

Deve Gowda : తన మనవడు ప్రజ్వల్ రేవణ్ణ, కొడుకు హెచ్‌డీ రేవణ్ణల సెక్స్ కుంభకోణంపై ఎట్టకేలకు మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మౌనం వీడారు. శనివారం ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నా మనవడు ప్రజ్వల్ రేవణ్ణ నేరం చేసినట్లు రుజువైతే అతనిపై చర్యలు తీసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు’’ అని దేవెగౌడ ప్రకటించారు. ‘‘నా కుమారుడు, జేడీ(ఎస్) ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణపై లైంగిక వేధింపులు, మహిళ కిడ్నాప్ వ్యవహారంలో తప్పుడు కేసులను బనాయించారు.  ప్రస్తుతం ఈ విషయాలపై విచారణ జరుగుతోంది. అందుకే వాటిపై నేను ఇంకా ఎక్కువగా మాట్లాడటం సరికాదు’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘ప్రజ్వల్ ప్రస్తుతం దేశంలో లేడు. చట్టప్రకారం చర్యలు ఉండాలి. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తుల పేర్లు చెప్పను కానీ.. వారిపై కూడా చర్యలు ఉండాలి’’ అని దేవెగౌడ వ్యాఖ్యానించారు.

We’re now on WhatsApp. Click to Join

శనివారం 92వ వసంతంలోకి అడుగుపెట్టిన మాజీ ప్రధాని దేవెగౌడ(Deve Gowda) తన పుట్టినరోజును జరుపుకోకూడదని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. శ్రేయోభిలాషులు, పార్టీ కార్యకర్తలు ఎక్కడ ఉన్నా కూడా వారి శుభాకాంక్షలు తనకు అందుతాయన్నారు. ఇక ప్రజ్వల్‌తో తనకు ఎలాంటి కాంటాక్ట్ లేదని దేవెగౌడ మరో కుమారుడు కుమారస్వామి చెప్పారు. కర్ణాటకలో ఉన్న సమయంలో కూడా టచ్‌లో లేనన్నారు.  అతడి వెంట పరిగెత్తాలా ఏంటి..? అని ఆయన మీడియాను ప్రశ్నించారు.

Also Read : Bibhav Kumar Arrest : స్వాతి మలివాల్‌పై దాడి.. కేజ్రీవాల్ మాజీ పీఎస్ బిభవ్ అరెస్ట్

దేవెగౌడ మనవడు, 33 ఏళ్ల ప్రజ్వల్ రేవణ్ణ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు  ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించిన చాలా వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ప్రజ్వల్ రేవణ్ణ ఏప్రిల్ 27న జర్మనీకి పారిపోయాడు. అతన్ని వెనక్కి తీసుకురావడానికి ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీసు కూడా జారీ చేసింది. మహిళను కిడ్నాప్ చేసిన కేసుకు సంబంధించి ప్రజ్వల్ తండ్రి హెచ్‌డీ రేవణ్ణకు ఇటీవల బెయిల్ వచ్చింది. ప్రజ్వల్ బాధిత మహిళను కిడ్నాప్ చేయించిన కేసులో మే 4న ఆయన్ను కర్నాటక సర్కారు ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అరెస్టు చేసింది. అరెస్టు సమయంలో హెచ్‌డీ రేవణ్ణ అధికారులకు సహకరించలేదు. తన తండ్రి దేవెగౌడ నివాసంలో ఉన్న హెచ్‌డీ రేవణ్ణను అరెస్టు చేసేందుకు అధికారులు రాగా.. సాయంత్రం 5.17 గంటల నుంచి 6.50 గంటల వరకు సరైన సమయం కాదని, ఇంట్లో తలుపు వేసుకుని కూర్చున్నారు. సాయంత్రం 6.50 తర్వాత ఆయనే తలుపు తీసి, సిట్ అధికారుల ఎదుట లొంగిపోయారు.