Site icon HashtagU Telugu

Maha Kumbh Mela: మహా కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయం: బీఆర్ నాయుడు

Maha Kumbh Mela

Maha Kumbh Mela

Maha Kumbh Mela: ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ (అలహాబాద్ )లో జరుగనున్న మహా కుంభమేళాలో (Maha Kumbh Mela) సెక్టార్ 6లో వాసుకి ఆలయం ప్రక్కన శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు వెల్లడించారు. జనవరి 13, 2025 నుంచి ఫిబ్రవరి 26, 2025 వరకు మహా కుంభమేళా జరుగనున్న నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు చక్కటి ఏర్పాట్లు చేసేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. రామచంద్ర పుష్కరిణి వద్ద మీడియాతో శనివారం ఛైర్మన్ మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ప్రయాగ్ రాజ్‌లో ఉత్తరాధి భక్తులు శ్రీవారిని దర్శించుకునేలా శ్రీవారి నమూనా ఆలయాన్ని నిర్మిస్తున్నామన్నారు. తిరుమల తరహాలో శ్రీవారి కల్యాణోత్సవాలు, చక్రస్నానం, తదితర కైంకర్యాలు చేపడుతారని ఛైర్మన్ తెలిపారు. భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్, పుష్ప అలంకరణలు చేపట్టాలని సూచించామన్నారు. మహాకుంభ మేళాకు సంబంధించి ప్రధాన రోజులలో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ముందస్తుగా కార్యాచరణ సిద్దం చేశారన్నారు. మహాకుంభ మేళాకు టీటీడీ అధికారులు సమిష్టిగా ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. ఎస్వీబీసీ ద్వారా ఎప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారాలు అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జేఈవో ఎం. గౌతమి, సివీఎస్‌వీ శ్రీధర్, మునిసిపల్ కమిషనర్ మౌర్య‌, టీటీడీ సీఈ సత్యనారాయణ, తదితర అధికారులు పాల్గొన్నారు.

Also Read: Refund Rules: విమాన ప్ర‌యాణీకుల‌కు అదిరిపోయే న్యూస్‌.. ఇలా జ‌రిగితే మీ ఖాతాకు డ‌బ్బు!

కుంభ మేళా అంటే ఏమిటి?

కుంభ మేళా అనేది అనేక మంది హిందువులు ఒక ప్రాంతానికి సంస్కౄతీ పరమైన కార్యక్రమాల కోసం చేరుకునే యాత్ర. సాధారణ కుంభ మేళా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళా అనేది ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేక ప్రయాగలలో జరుగుతుంది. పూర్ణ కుంభ మేళా అనేది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ, (అలహాబాద్), హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ లలో జరుగుతుంది. పన్నెండు పూర్ణ కుంభ మేళాలు పూర్తి అయిన తరువాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్ లో మహా కుంభ మేళా నిర్వహిస్తారు.