Mallikarjun Kharge : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఖర్గే.. కర్ణాటకలోని గుల్బర్గా (కలబురిగి) వాస్తవ్యులు. ఆయన కుటుంబం సిద్ధార్థ విహార్ ట్రస్ట్‌ను నిర్వహిస్తోంది. 5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈ ట్రస్టుకు కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారు గతంలో కేటాయించింది. ఇప్పుడు మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూముల స్కాంపై దర్యాప్తునకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ రంగంలోకి దిగింది. ఈ తరుణంలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. తమ ట్రస్టుకు కేటాయించిన ప్రభుత్వ భూమిని రాష్ట్ర సర్కారుకు వెనక్కి ఇచ్చేయాలని ఆయన డిసైడ్ అయ్యారు. కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్‌మెంట్ బోర్డ్ (కేఐఏడీబీ) ద్వారా బగలూరులోని హైటెక్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ పార్క్ హార్డ్‌వేర్ సెక్టార్‌లో ఐదు ఎకరాల భూమిని గతంలో మల్లికార్జున్ ఖర్గే కుమారుడు రాహుల్ ఖర్గేకు కేటాయించారు. సిద్ధార్థ విహార్ ట్రస్ట్‌ను రాహుల్ ఖర్గే (Mallikarjun Kharge) నడుపుతుంటారు.
Also Read :Alai Balai : తెలంగాణ సాధనలో ‘అలయ్ బలయ్’ పాత్ర కీలకం : సీఎం రేవంత్
ఖర్గే ఫ్యామిలీకి చెందిన సిద్ధార్థ విహార్ ట్రస్టుకు ఐదు ఎకరాల ముడా భూమిని షెడ్యూల్ కులం (ఎస్‌సీ) కోటా కింద కేటాయించారని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ఇటీవలే ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వాల అధికార దుర్వినియోగం, ఆశ్రిత పక్షపాత వైఖరికి ఈ కేటాయింపులే నిదర్శనం అని ఆయన పేర్కొన్నారు. సిద్ధార్థ విహార్ ట్రస్టులో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఆయన అల్లుడు, కలబురగి ఎంపీ రాధాకృష్ణ, కుమారుడు రాహుల్ ఖర్గే, పలువురు ఖర్గే కుటుంబ సభ్యులు ట్రస్టీలుగా ఉన్నారు. ఖర్గే కుటుంబానికి చెందిన ట్రస్టుకు ఈ భూమిని కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ సామాజిక కార్యకర్త దినేష్ కల్లహల్లి కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్‌కు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఆరోపణలను కర్ణాటక పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ ఖండించారు. రాహుల్ ఖర్గే అర్హత కలిగిన దరఖాస్తుదారుడు అని ఆయన స్పష్టం చేశారు. పారదర్శక ఎంపిక ప్రక్రియ, సింగిల్ విండో ద్వారా మెరిట్ ఆధారంగానే సిద్ధార్థ విహార్ ట్రస్టుకు భూమిని కేటాయించామని మంత్రి ఎంబీ పాటిల్ తెలిపారు.