Emojis Vs Marks : కేరళ రాష్ట్రం అక్షరాస్యత విషయంలో మన దేశానికి తలమాణికం. చాలా ఏళ్ల క్రితమే వంద శాతం అక్షరాస్యతతో కేరళ తిరుగులేని రికార్డును సాధించింది. ఈ రాష్ట్ర విద్యా వ్యవస్థలో మరో విప్లవాత్మక మార్పు అమల్లోకి వచ్చింది. కొచ్చి నగరం పరిధిలోని పలు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) స్కూళ్లలో వినూత్న మూల్యాంకన విధానం అమల్లోకి వచ్చింది. కిండర్ గార్టెన్ నుంచి 2వ తరగతి వరకు విద్యార్థులకు పరీక్షలను నిర్వహించినప్పుడు ఇంతకుముందు వరకు మార్కులు వేసేవారు. కానీ ఇప్పుడు మార్కులకు బదులుగా స్టార్లు, ఎమోజీలు వేస్తున్నారు. మార్కులు, గ్రేడ్‌ల వల్ల విద్యార్థులపై మానసిక ఒత్తిడి పడుతుందని.. దాన్ని తగ్గించేందుకే ఈ తరహా మూల్యాంకనాన్ని అమలు చేస్తున్నట్లు ఆయా సీబీఎస్‌ఈ పాఠశాలల నిర్వాహకులు చెబుతున్నారు. జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి స్టార్లు, ఎమోజీలు ఇవ్వడం వల్ల విద్యార్థులకు ప్రోత్సాహం లభిస్తుందని విద్యారంగ నిపుణులు(Emojis Vs Marks) అంటున్నారు.
Also Read :World War 3 : ట్రంప్ అధ్యక్షుడు అయ్యేలోగా మూడో ప్రపంచ యుద్ధం.. బైడెన్ కుట్ర : జూనియర్ ట్రంప్
కొచ్చి నగరానికి చెందిన సీబీఎస్ఈ విద్యాసంస్థల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు టీపీ ఇబ్రహీం ఖాన్ మాట్లాడుతూ.. తాము నూతన విద్యా విధానం అమలులో భాగంగానే 2వ తరగతి వరకు విద్యార్థులకు మార్కులు వేయడం ఆపేసినట్లు చెప్పారు. స్టార్లు, ఎమోజీలను వేసినప్పటి నుంచి విద్యార్థుల్లో సానుకూల మార్పును గుర్తించామన్నారు. దీంతోపాటు పరీక్ష రాసి తీరు ఆధారంగా ఆయా తరగతుల పిల్లల యూనిఫామ్‌లపై స్టార్లను అతికిస్తున్నట్లు తెలిపారు. వాటిని చూసి విద్యార్థులు ఉత్తేజితులు అవుతారని, చదువుపై వారి ఆసక్తి మరింత పెరుగుతుందని చెప్పారు. మొత్తం మీద కేరళలో మొదలైన ఈవిధమైన నూతన మూల్యాంకన విధానం త్వరలోనే మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ మొదలయ్యే అవకాశం ఉంది. తెలంగాణ, ఏపీలోని పాఠశాలలు కూడా దీన్ని అనుసరించే ఛాన్స్ లేకపోలేదు.