Jallikattu 2025: సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందెలు నిర్వహించడం అనేది ఒక సంప్రదాయం. అంతే కాకుండా, తమిళనాడులో కూడా ప్రజలు ప్రతి ఏడాది జల్లికట్టు పేరిట సంబరాలు జరుపుకుంటారు. ఈసారి, 2025 జల్లికట్టు పోటీలకు తమిళనాడు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
జల్లికట్టు పోటీలు ఈసారి ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను సంక్రాంతి అని పిలుస్తారు, ఇక తమిళనాడులో దీనికి పొంగల్ అని పేరు. అయినా, పండుగ ఒకటే. ఈసారి సంక్రాంతి పండుగ సందర్భంగా తమిళనాడులో జరగనున్న జల్లికట్టు పోటీల్లో అపశృతి నివారించడానికి ప్రభుత్వం కొన్ని కొత్త నియమాలను ప్రకటించింది.
తమిళనాడు రాష్ట్రంలోని అలంకనల్లూరు, పాలమేడు, అవనియాపురం, మదురై, పుదుకోట్టై, శివగంగై వంటి ప్రధాన ప్రాంతాల్లో జల్లికట్టు పోటీలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యప్రద సాహు జల్లికట్టు నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపించారు.
Jallikattu
జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరి:
జల్లికట్టు పోటీలు నిర్వహించాలనుకునే నిర్వాహకులు ముందుగా జిల్లా కలెక్టర్ నుంచి ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుంది. కలెక్టర్ అనుమతి లేకుండా జల్లికట్టు పోటీలు నిర్వహించడాన్ని ప్రభుత్వం అనుమతించదు. అలాగే, పోటీల్లో పాల్గొనే ఎద్దులను వేధించకూడదని, ప్రతి పోటీని వీడియో ద్వారా రికార్డు చేయాలని కొత్త మార్గదర్శకాల్లో పేర్కొంది.
బోర్డ్ నివేదిక తప్పనిసరి:
జల్లికట్టు పోటీ తేదీ కంటే ముందే అన్ని ఏర్పాట్లు చేయాలని, తమిళనాడు జంతు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసిన కమిటీ పోటీలకు ముందే కార్యక్రమాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని సూచించింది.
ఆన్‌లైన్ దరఖాస్తులు…
జల్లికట్టు ఈవెంట్స్ కోసం కొత్తగా డిజైన్ చేసిన వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ప్రాసెస్ చేయాలి. దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ www.jallikattu.tn.gov.in ను సందర్శించండి.